అప్పటికే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: పాక్‌ నేత

Pakistan Leader Says Army Chief Was Shaking Meet Of Abhinandan Release - Sakshi

ఇస్లామాబాద్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఇప్పటివరకు అన్నిరకాలుగా మద్దతుగా నిలిచాయని, అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌(పీఎంఎల్‌-ఎన్‌) నేత ఆయాజ్‌ సాదిక్‌ అన్నారు. భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విడుదల విషయంలో ఇమ్రాన్‌ సర్కారు నిర్ణయంతో తాము ఏకీభవించినట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో గత కొన్నిరోజులుగా పాకిస్తాన్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా వ్యాప్తితో అతలాకుతలమవుతున్న వేళ, మరోవైపు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలు క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.(చదవండి: పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం?)

ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అయాజ్‌ సాదిఖ్‌ బుధవారం నేషనల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తూ. అభినందన్‌ వర్ధమాన్‌ విడుదల నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ నిరాకరించారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా గదిలోకి వచ్చారు. అప్పటికే ఆయన కాళ్లు వణుకుతున్నాయి. చెమటలు పట్టాయి. భారత వింగ్‌ కమాండర్‌ను విడుదల చేయనట్లయితే, రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌పై, ఇండియా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఖురేషి చెప్పారు. అభినందన్‌ను విడుదల చేయడం ఒక్కటే మార్గమని, పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌ తదితర పార్టీలను అభ్యర్థించారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించాయి’’ అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనం ప్రచురించింది.

కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో.. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్‌ అభినందన్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్‌-21 కూలిపోవడంతో ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్‌ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top