ఇమ్రాన్‌ వక్రబుద్ధి : గిలానీకి అత్యున్నత పురస్కారం

Pakistan To Confer Its Highest Civilian Award To Syed Ali Shah Geelani - Sakshi

ఇస్లామాబాద్‌ : భారత వ్యతిరేక శక్తులను  ఎప్పుడూ తమ మిత్రులుగా భావించే పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్‌ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన గిలానీని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రశంసల్లో ముంచెత్తింది. అంతేకాకుండా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ -ఈ- పాకిస్తాన్’ అనే బిరుదుకు గిలానీని ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం ఆయనకు అవార్డును ప్రకటించింది. (వేర్పాటువాద నాయకుడు సంచలన నిర్ణయం)

కశ్మీర్‌ కల్లోలానికి పరోక్ష కారణమైన సయ్యద్‌కు పాకిస్తాన్‌ అత్యున్నత అవార్డును ప్రకటించడంలో ఆంతర్యం ఏంటన్నిది తెలియరాలేదు. మరోవైపు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి తొలి ఏడాది పూర్తి కావడానికి సరిగ్గా వారం ముందు ఈ అవార్డును ప్రకటించడం గమనార్హం. కాగా  ఆర్టికల్‌  370 రద్దు అనంతరం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 16 పార్టీల కూటమి అయిన హురియత్‌ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సంస్థ సిద్దాంతం పక్కదారి పట్టిందని, సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గిలానీ ప్రకటించారు. 

కాగా  చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటోన్న 90 ఏళ్ల వయసున్న గిలానీ గత ఏడాది కేంద్రం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి అనిశ్చితిలో పడిపోయారు. 1993లో అవిభక్త హురియత్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపక సభ్యుడైన గిలానీ 2003లో భేదాభిప్రాయాలతో వేరు కుంపటి పెట్టారు. అప్పట్నుంచి ఆయనే సంస్థకు జీవితకాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన సంస్థ నుంచి వైదొలిగినా పాకిస్తాన్‌ పౌర పురస్కారం ప్రకటించడంతో మరోసారి తెరమీదకు వచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top