ఎలుకలు కరోనా వేరియంట్‌ని వ్యాప్తి చేస్తాయ్‌! అధ్యయనంలో వెల్లడి

New Study Found New Yark City Rats Can Carry Covid19 Variants - Sakshi

గత రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడి యథాస్థితికి వస్తోంది. ఐతే అసలు ఈ వైరస్‌ ఎలా వచ్చింది అనే దానిపై ఇప్పటికే శాస్తవేత్తలు పలు ఆసక్తికర పరిశోధనలు చేస్తునే ఉన్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా ఈ పరిశోధనలు చేయమని ‍ప్రో‍త్సహించడమే గాక తద్వారా భవిష్యత్తులో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా బయటపడొచ్చు అని సూచించింది.

అందులో భాగంగానే చేసిన పరిశోధనల్లో ఎలుకలు కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయగలవని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు పరిశోధకులు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఎలుకలు మూడు రకాల కోవిడ్‌ వేరియంట్‌లకు లోనైనట్లు పేర్కోన్నారు. ఈ విషయాన్ని అమెరికన్‌ సోసైటీ ఫర్‌ మైక్రోబయాలజీ ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్‌ వెల్లడించింది.

పరిశోధనల్లో ఎలుకలకు సార్క్‌ కోవిడ్‌2, ఆల్ఫా, డెల్టా, ఓమిక్రాన్‌ వేరియంట్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. అందుకోసం మురుగునీటి  ప్రదేశాలు ఉన్న ప్రాంతాల నుంచి సేకరించిన ఎలకలను బంధించి పరిశోధనలు నిర్వహించారు. ఆ పరిశోధనల్లో సుమారు 79 ఎలుకల్లో దాదాపు 13 ఎలుకలకు సార్స్‌ కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు.

దీంతో యూఎస్‌ ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ఈ ఎలుకలు అంటువ్యాధులను వ్యాప్తి చేయగలవని తమ అధ్యయనంలో తేలిందని డాక్టర్‌ హెన్రీ వాన్‌ చెప్పారు. అలాగే ఈ పరిశోధనలు..  ఎలుకల్లో కరోనా ఎలా పరిణామం చెందుతుంది, అది మానువులకు ప్రమాదం కలిగించేలా రూపాంతరం చెందే అవకాశం ఉందా? అనేదాని గురించి తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని చెప్పారు.

ఎలుకలకు వచ్చిన కరోనా మహమ్మారి మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మానవులను ప్రభావితం చేసిన ఈ కరోనా మహమ్మారి విషయంలో జంతువులు కూడా కీలక పాత్ర పోషిస్తాయనే దానిపై అధ్యయనం చేయడం ద్వారా మానవులతోపాటు జంతువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలమని పరిశోధకులు చెబుతున్నారు.

కాగా, జంతువుల నుంచి మానవులకు కరోనా సంక్రమించడం అత్యంత అరుదని సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది. కరోనాకు కారణమైన సార్స్‌ కోవిడ్‌2 ప్రజలకు వ్యాప్తి చేయడంలో జంతువులు ముఖ్యపాత్ర పోషిస్తాయనేందుకు సరైన ఆధారాలు మాత్రం లేవని సీడీసి వెల్లడించింది.

కానీ ఈ మహమ్మారి సోకిన క్షీరద జంతువులతో సంబంధం ఉన్న ప్రజలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు వెల్లడించాయని సీడీసీ తన వెబ్‌సెట్‌లో పేర్కొంది. ఇంతకుముందు హాంకాంగ్‌, బెల్జియంలో ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో కరోనా వైరస్‌ బారిన పడినట్లు కనుగొన్నారు శాస్తవేత్తలు. కానీ కరోనా వేరియంట్‌కి సంబంధించిన అధ్యయనాల్లో మాత్రం పూర్తి స్ధాయిలో స్పష్టత రావాల్సి ఉంది. అలాగే పిల్లులు, కుక్కలు, ప్రైమేట్స్, హిప్పోలు, జింకలు, యాంటియేటర్లు వంటి వాటికి కరోనా సోకినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి కూడా!
(చదవండి: వరదలతో అతలాకుతలమైన కాలిఫోర్నియా..ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top