అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలకు తెరదించే ప్రయత్నంలో అట్లాంటిక్ కూటమి (నాటో) కీలక అడుగులు వేస్తోంది. సభ్యదేశాల మధ్య ఐక్యతపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా చేయడంతో పాటు, వాషింగ్టన్ ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ఐరోపా భద్రతకు పెరుగుతున్న సవాళ్లు, అమెరికా వైఖరిలో వచ్చిన మార్పులు, సభ్యదేశాలపై ట్రంప్ ఒత్తిడి.. ఈ మూడింటి మధ్య జరుగుతున్న అంకారా(టర్కీ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
నాటో ఏర్పడి దాదాపు ఎనిమిది దశాబ్దాలు అవుతోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఐరోపాలోని మొత్తం 32 దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ సైనిక వ్యయంలో సగానికి పైగా ఈ దేశాలదే. అలాంటి కూటమిలో గత కొన్నేళ్లుగా ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అమెరికా లేకుండా నాటో కొనసాగగలదా? అదే సమయంలో మరో ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అమెరికా ఎందుకు మిగతా దేశాల భద్రత కోసం అంత భారీగా ఖర్చు చేయాలి? ఈ రెండో ప్రశ్ననే డొనాల్డ్ ట్రంప్ అత్యంత బలంగా లేవనెత్తారు.
ట్రంప్‌కు నాటోపై వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కానీ కూటమి నిర్వహణ తీరుపై ఆయన చాలాకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చిస్తుంటే, ఐరోపాలోని అనేక దేశాలు మాత్రం తమ భద్రత బాధ్యతను అమెరికాపైనే వదిలేశాయని ఆయన విమర్శిస్తున్నారు.
"అమెరికా డబ్బుతో యూరప్ భద్రత ఎందుకు?" అనే ప్రశ్నను ఆయన ఎన్నికల ప్రచారంలోనే కాదు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ పదేపదే లేవనెత్తారు. సభ్యదేశాలు తగిన రక్షణ వ్యయం చేయకపోతే అమెరికా తన భద్రతా హామీలను పునఃసమీక్షిస్తుందని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఒక దశలో అమెరికా నిజంగానే నాటో నుంచి తప్పుకుంటుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది.
అయితే ట్రంప్ ఎప్పుడూ ‘‘నాటోను రద్దు చేస్తాను’’.. ‘‘నాటో నుంచి తప్పుకుంటాం’’ అని అధికారికంగా ప్రకటించలేదు. ఆయన లక్ష్యం కూటమిని బలహీనపరచడం కాదని, సభ్యదేశాలు కూడా సమాన బాధ్యతలు తీసుకునేలా చేయడమేనని ఆయన సన్నిహితులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అంకారాలో జరుగుతున్న సమావేశం చూస్తే, ట్రంప్ ఎన్నాళ్లుగానో చెబుతున్న అంశాలకే నాటో స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అందుకే ఈసారి సభ్యదేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలనే లక్ష్యాన్ని దశలవారీగా 5 శాతానికి పెంచేందుకు అంగీకరించాయి. ఇందులో 3.5 శాతం నేరుగా సైనిక సామర్థ్యాల పెంపు, ఆయుధాల కొనుగోలు, సైనిక దళాల ఆధునికీకరణకు వినియోగిస్తారు. మిగిలిన 1.5 శాతం సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ పరిశ్రమ, సైనిక రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. నాటో చరిత్రలో ఇదే అతిపెద్ద రక్షణ వ్యయ లక్ష్యంగా భావిస్తున్నారు.
ఇదొక్కటే కాదు.. సమావేశం ముగింపులో విడుదల చేసే సంయుక్త ప్రకటనలో నాటో ఒప్పందంలోని ఆర్టికల్-5 మీద తమ నిబద్ధత "అచంచలం" అని మరోసారి ప్రకటించనున్నారు. ఈ నిబంధనే నాటోకు వెన్నెముకగా భావిస్తారు. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి మిగతా సభ్యదేశాలన్నీ రక్షణకు ముందుకు రావాలనేది దీని సారాంశం. ట్రంప్ గతంలో ఈ అంశంపైనా సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సమావేశంలో మరో కీలక అంశం ఉక్రెయిన్. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీవ్‌కు సైనిక, ఆర్థిక సహకారాన్ని ఎలా కొనసాగించాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే గత సమావేశాలతో పోలిస్తే ఈసారి ఉక్రెయిన్ అంశం కంటే అమెరికా-నాటో సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ట్రంప్ వైఖరి కారణంగా కూటమిలో ఎలాంటి చీలికలు ఏర్పడకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
నాటోలోని చాలా దేశాలు ఇప్పటికే రక్షణ వ్యయాన్ని పెంచడం ప్రారంభించాయి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు కేవలం మూడు దేశాలే జీడీపీలో 2 శాతం రక్షణకు ఖర్చు చేసేవి. ఇప్పుడు 32 సభ్యదేశాల్లో మెజారిటీ ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరోపా దేశాలు తమ సైనిక బలాన్ని పెంచడంపై మరింత దృష్టి సారించాయి. ఇప్పుడు 5 శాతం లక్ష్యంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.
అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా-చైనా పోటీ, రష్యా దూకుడు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ఇలా అనేక పరిణామాలు ఒకేసారి చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాయకత్వంలోని నాటోలో ఎలాంటి బలహీనత కనిపించినా అది ప్రత్యర్థి దేశాలకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. అందుకే ట్రంప్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను విస్మరించకుండా, వాటికి సమాధానమిస్తూ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈసారి అడుగులు వేస్తున్నాయి.
అమెరికా లేకుండా నాటోను ఊహించడం కష్టం. అదే సమయంలో నాటో లేకుండా ఐరోపా భద్రతను ఊహించడం కూడా అంతే కష్టం. ఈ వాస్తవాన్ని గుర్తించిన సభ్యదేశాలు ఇప్పుడు ఒకే సందేశం ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికా నమ్మకాన్ని కోల్పోకుండా, కూటమి బలాన్ని మరింత పెంచుకోవడం. అంకారా సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు రానున్న సంవత్సరాల్లో అమెరికా-నాటో సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించనున్నాయి.


