టిక్‌.. టిక్‌.. టిక్‌... మిగిలింది 19 రోజులే | NASA has only 19 days left to rescue Sunita Williams and Butch Wilmore | Sakshi
Sakshi News home page

టిక్‌.. టిక్‌.. టిక్‌... మిగిలింది 19 రోజులే

Aug 5 2024 5:16 AM | Updated on Aug 5 2024 6:37 AM

NASA has only 19 days left to rescue Sunita Williams and Butch Wilmore

ఇంకా ఐఎస్‌ఎస్‌లోనే సునీత 

23 కల్లా బయల్దేరి తీరాలి 

లేదంటే క్రూ–9 మిషన్‌కు బ్రేక్‌ 

వాషింగ్టన్‌: బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికే (ఐఎస్‌ఎస్‌) పరిమితమైన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. వారు మరో 19 రోజుల్లో వారం అక్కడి నుంచి బయల్దేరకపోతే మరో కీలక ప్రయోగాన్ని నిలిపివేయక తప్పదు. అందుకే నాసా సైంటిస్టులు, బోయింగ్‌ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.  

ఎందుకీ ఆందోళన? 
విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ సంస్థ తొలిసారి అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సునీత, విల్మోర్‌ జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌కు బయలుదేరారు. అయితే నింగిలోకి దూసుకెళ్తున్న క్రమంలోనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 మొరాయించాయి. సరీ్వస్‌ మాడ్యూల్‌లో ఐదు చోట్ల హీలియం లీకేజీలు బయటపడ్డాయి. సానా సైంటిస్టులు భూమి నుంచే రిమోట్‌ కంట్రోల్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. తర్వాత స్టార్‌లైనర్‌ ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమై జూన్‌ 13న సునీత, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌లోకి అడుగుపెట్టారు. 

షెడ్యూల్‌ ప్రకారం వారం తర్వాత స్టార్‌లైనర్‌లో వెనక్కు రావాలి. కానీ దానికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తే తప్ప బయల్దేరలేని పరిస్థితి! మరోవైపు స్పేస్‌ఎక్స్‌ ‘క్రూ–9 మిషన్‌’లో భాగంగా నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, నిక్‌ హేగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ ఈ నెల 18న ఐఎస్‌ఎస్‌కు బయలుదేరాల్సి ఉంది. వారు 23 కల్లా అక్కడికి చేరేలా గతంలోనే షెడ్యూల్‌ ఖరారైంది. ఐఎస్‌ఎస్‌ నుంచి స్టార్‌లైనర్‌ వెనక్కి వస్తే తప్ప ‘క్రూ–9’ను పంపలేని పరిస్థితి! దాంతో ఏం చేయాలో అర్థంకాక నాసా తల పట్టుకుంటోంది. దీనికి తోడు ఐఎస్‌ఎస్‌లో సునీత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు సమాచారం. స్టార్‌లైనర్‌ త్వరలో సిద్ధం కాకుంటే ఆమెను రప్పించడానికి ప్రత్యామ్నాయం చూడాల్సి రావొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement