ఆయుధ సరఫరాలే లక్ష్యం

Missiles hit power stations in Lviv and along crucial railways in Ukraine - Sakshi

యూరప్‌ వాహనాలపై రష్యా దాడులు

రైలు మార్గాలపై బాంబుల వర్షం

ఆయుధాగారాల ధ్వంసం

వందలాది మరణాలు: ఉక్రెయిన్‌

9న పుతిన్‌ ‘పూర్తి యుద్ధ’ ప్రకటన!

లివీవ్‌: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత తీవ్రతరం చేసింది. అమెరికా, యూరప్‌ దేశాల ఆయుధ సరఫరాలే లక్ష్యంగా పశ్చిమ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా రైల్వే లైన్లు, ప్రధాన రోడ్డు మార్గాలపై గురి పెట్టింది. రైల్వేస్టేషన్లకు కరెంటు సరఫరా చేస్తున్న ఐదు విద్యుత్కేంద్రాలను, పలు ఆయుధాగారాలను ధ్వంసం చేసింది. లివీవ్‌పైనా తీవ్రస్థాయిలో దాడులకు దిగింది. నగరంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు దెబ్బ తిని పలుచోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది.

ఉక్రెయిన్‌లోకి ఆయుధాలతో వెళ్లే నాటో, పాశ్చాత్య వాహనాలన్నింటినీ ధ్వంసం చేసేస్తామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ హెచ్చరించారు. తూర్పున డోన్బాస్‌ను పూర్తిగా చేజిక్కించుకునే ప్రయత్నాలను కూడా రష్యా ముమ్మరం చేసింది. అక్కడి క్రొమటోర్క్‌స్, సెవరోడోనెట్స్‌క్‌ సహా పలు నగరాలను ఆక్రమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్‌ వెల్లడించింది. తాజా దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్‌ చెప్పింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంటుపై మళ్లీ దాడులకు దిగామన్న వార్తలను రష్యా రక్షణ మంత్రి ఖండించారు. కానీ అక్కడ బాంబింగ్‌ కొనసాగుతోందని ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ చెప్పుకొచ్చింది.

మే 9న విక్టరీ డే ఉత్సవాల సందర్భంగా ఉక్రెయిన్‌పై పుతిన్‌ ‘పూర్తిస్థాయి యుద్ధం’ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. దీన్ని రష్యా ఖండించింది. రష్యాలో జెర్జిన్‌స్కీ పారిశ్రామిక ప్రాంతంలో ఓ ప్రభుత్వ పుస్తక ప్రచురణ సంస్థలో భారీ మంటలు చెలరేగాయి. ఇది రష్యాలో ప్రచ్ఛన్నంగా ఉన్న ఉక్రెయిన్‌ బలగాల పనేనని అనుమానిస్తున్నారు. రష్యా సైన్యం తమ భూభాగం నుంచి పూర్తిగా వైదొలిగేదాకా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందమూ ఉండబోదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. పుతిన్‌ తనతో చర్చలకు రావాలన్నారు. ‘‘తొలి దశ యుద్ధంలో రష్యాను నిలువరించాం. మలి దశలో తరిమికొడతాం. చివరిదైన మూడో దశలో ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా పునరుద్ధరించుకుంటాం’’ అని ధీమా వెలిబుచ్చారు.

రష్యా చమురును నిషేధిద్దాం: ఈయూ చీఫ్‌
రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను 27 యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఏకగ్రీవంగా, సంపూర్ణంగా నిషేధించాలని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాండెర్‌ లియెన్‌ ప్రతిపాదించారు. పుతిన్‌ సన్నిహితుడైన రష్యా ఆర్థడాక్స్‌ చర్చి చీఫ్‌ కిరిల్‌పై ఆంక్షలు విధించాలని కూడా ఈయూ యోచిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top