‘ఇదే నా చివరి మెసేజ్‌ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు

This Might Be My Last Message Says Indian Sailor Detained In Equitorial - Sakshi

‘నైజీరియన్‌ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి సందేశం కావొచ్చు. మీరంతా నాకు సాయం చేస్తారని భావిస్తున్నా..’ అంటూ ఇక్వెటోరియల్‌ గినీలో బందీగా మారిన ఓ భారత నావికుడి వీడియో సందేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ఆఫ్రికా దేశమైన ఇక్వెటోరియల్‌ గినీలో గత ఆగస్టు నెలలో ‘హీరోయిక్‌ ఇడున్‌’ అనే నౌకను అక్కడి నౌకాదళం బందించింది. అందులోని 16 మంది భారత నావికులు సహా సిబ్బంది బందీలుగా ఉన్నారు. ఆగస్టు 13న హీరోయిక్‌ ఇడున్‌ నౌకపై ఇక్వెటోరియల్‌ గినియా జెండా లేదనే కారణంగా నిలిపేశారు. గత 80 రోజులుగా నావికులు బందీలుగా ఉన్నారని, వారిని నైజీరియా నేవీ అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో హీరోయిక్‌ ఇడున్‌ నౌక చీఫ్‌ ఆఫీసర్‌, భారత నావికుడు సాను జోష్‌ తనను అదుపులోకి తీసుకునేందుకు కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ‘నైజీరియాన్‌ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి మెసేజ్‌ కావొచ్చు. మీరంతా నన్ను చూస్తున్నారని, నాకు సాయం చేస్తారని భావిస్తున్నా. ఈ సందేశాన్ని దేశంలోని ప్రతిఒక్కరికి చేరేలా చేస్తారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు సాను జోష్‌.

బందీలుగా మారిన భారత నావికులను విడిపించేందుకు భారత అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది సురక్షితంగా స్వదేశం చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు.. గత ఆగస్టు నెల మధ్యలోనే హీరోయిక్‌ ఇడున్‌ అనే నౌకకు చెందిన భారత నావికులు సహా సిబ్బంది అంతా బందీలుగా పట్టుబడ్డారని విదేశాంగ శాఖకు తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం. మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బందీలను త్వరగా విడుదల చేయడానికి గినీ, నైజీరియా దేశాలకు చెందిన అధికారులతో చర్చిస్తున్నామని ఇక్వెటోరియల్‌ గినీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్‌ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top