Marburg: వెలుగులోకి మరో వైరస్‌: సోకిందంటే మరణమే

Marburg Virus Disease Detected in West Africa - Sakshi

పశ్చిమ ఆఫ్రికాలో వెలుగు చూసిన మరో మహమ్మారి

కరోనాతో పోలిస్తే మార్‌బర్గ్‌ వల్ల మరణాల రేటు అధికం: డబ్ల్యూహెచ్‌ఓ

గినియా/కోనక్రీ: కరోనా మహమ్మారికి కళ్లెం వేయకముందే ప్రపంచం ముంగిట మరో కొత్త సమస్య ప్రవేశించింది. కోవిడ్‌ ప్రభావం నుంచి కోలుకోకముందే మరో మహమ్మారి తరుముకొస్తుంది. ఇది కరోనా కన్న మరింత ప్రమాదకరం అని.. ఒక్కసారి ఈ వైరస్‌ సోకితే మరణమే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ వివరాలు..

పశ్చిమ ఆఫ్రికా గినియాలో మరో ప్రమాదకర వైరస్‌ వెలుగు చేసుంది. దీని పేరు మార్‌బర్గ్‌ అని.. ఇది గబ్బిలాల ద్వారా మనుషులకు సోకుతుందని.. దీనివల్ల మరణాల రేటు భారీగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఆగస్టు 2న మరణించిన ఓ వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. దక్షిణ గెక్‌కెడౌ ప్రిఫెక్చర్‌ ప్రాంతంలో తొలి మార్‌బర్గ్‌ కేసును గుర్తించినట్లు ఆఫ్రికా డబ్ల్యూహెచ్‌ఓ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మత్షిడిసో మోయెటి తెలిపారు. మార్‌బర్గ్‌ వైరస్‌ చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దానిని ట్రాక్‌ చేయాల్సిన అవసరం ఉందని మత్షిడిసో పేర్కొన్నారు.

గినియాలో ఎబోలా సెకండ్‌ వేవ్‌ ముగిసిందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన రెండు నెలలకే ఈ కొత్త వైరస్‌ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మార్‌బర్గ్‌ సాధారణంగా రౌసెట్టస్‌ గబ్బిలాలకు ఆవాసాలుగా మారిన గుహలు, మైన్స్‌ల ద్వారా బహిర్గతమవుతుంది. ఈ వైరస్‌ వ్యాప్తిలో మరణాల రేటు 88 శాతంగా ఉంటుందన్నారు.

ఏంటి మార్‌బర్గ్‌ వైరస్‌..
మార్‌బర్గ్‌ కూడా ఎబోలా వైరస్‌ కుటుంబానికి చెందిన వైరసే. దాని కన్నా ఇది మరింత ప్రమాదకారి. ఈ వైరస్‌ సోకిన వారు రక్తస్రావ జ్వరం బారిన పడతారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 1967లో జర్మనీ, బెల్‌గ్రేడ్‌, సెర్బియాలో ఒకేసారి రెండు అంటువ్యాధులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే మార్‌బర్గ్‌, ప్రాంక్‌ఫర్ట్‌ వ్యాధులను గుర్తించారు. ఉగాండ నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రీకన్‌ ఆకుపచ్చ కోతుల మీద పరిశోధన చేస్తున్న ల్యాబ్‌ నుంచి ఈ రెండు అంటువ్యాధులు బయటకు విడుదల అయ్యాయి. 

మార్‌బర్గ్‌ వైరస్‌ సోకిన వ్యక్తుల రక్తం, స్రావలు, అవయవాలు, ఇతర శరీర ద్రవాలు, వీటితో కలిసిన ఉపరితలాలు, ఇతర పదార్ధాల ద్వారా.. ఇది ఇతరులకు సోకుతుంది. వైరస్ పొదిగే కాలం రెండు నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. 2008 లో, ఉగాండాలోని రౌసెట్టస్‌ గబ్బిలాలు నివసించే గుహను సందర్శించిన ప్రయాణికులలో రెండు స్వతంత్ర కేసులు గుర్తించారు.

మార్‌బర్గ్‌ వ్యాధి లక్షణాలు...
మార్‌బర్గ్‌ వైరస్ బారిన పడిన వ్యక్తికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. ఇవేకాక మూడవరోజు నుంచి తీవ్రమైన నీటి విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు ప్రారంభమవుతాయి. ఇవి ఒక వారం పాటు కొనసాగుతాయి. ఈ వ్యాధి సోకిన వారి కళ్లు లోపలికి పోయి.. ముఖంలో ఏ భావాలు కనిపించకుండా ఉండటమే కాక.. విపరీతమైన బద్ధకంగా ఉంటారు.

ఇక మలేరియా, టైపాయిడ్‌, షిగెలోసిస్, మెనింజైటిస్ వంటి వాటిని గుర్తించినట్లు.. మార్‌బర్గ్‌ను గుర్తించడం కష్టమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు, సీరం న్యూట్రలైజేషన్ పరీక్షలు, సెల్ కల్చర్, ఆర్‌టీపీసీఆర్‌ ఉపయోగించి వైరస్ నిర్ధారణ చేయవచ్చిన తెలిపింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top