రగులుతున్న ‘మాలి'

Mali President Announces Resignation After Rebel Troops Launch Coup - Sakshi

బొమాకో : సైనికుల తిరుగుబాటుతో మాలి దేశం అట్టుడుకుతుంది. దీంతో మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో గ‌తకొత‌కాలంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. మాలిలో రక్తం పారవద్దనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు  ఆయన ప్ర‌క‌టించారు. త‌న రాజీనామా వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని స్పష్టం చేశారు. కాగా ఆయ‌న ప‌ద‌వీకాలం ఇంకా మూడేళ్ల పాటు ఉంది. అధ్యక్షుడి రాజీనామా అనంతరం మాలీ పార్లమెంట్ రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

2018లో జరిగిన ఎన్నికల్లో  కీతా  రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కానీ అవినీతి, ఆర్థికవ్యవస్థను చక్కదిద్దకపోవడం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మత హింసపై ప్రజల్లో ఆగ్రహం ఉంది.ఇస్లాం తిరుగుబాటును బౌబాకర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా మాలిలో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.మితవాద మత పెద్ద మహమూద్ డికో నేతృత్వంలో ఏర్పడిన ఒక కొత్త ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వంలో కలవాలంటూ  కీతా చేసిన ప్రతిపాదనను ఆ కూటమి తిరస్కరించింది. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చింది.

కాగా తిరుగుబాటు చేసిన సైనికులు కీతా క్యాంపులో ఉన్న ఇబ్రహీం బౌబాకర్‌తో పాటు ప్ర‌ధాని బౌబౌ సిస్సేను తమ అధీనంలోకి తీసుకున్నారు. అంత‌కుముందు విజ‌య సూచ‌కంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. తిరుగుబాటు సైనికుల‌తోపాటు, ప్ర‌జ‌లు కూడా భారీగా ‌రోడ్ల‌పైకి వచ్చి నిరసన తెలుపుతూ రాజ‌ధాని న‌గ‌రం బొమాకోను త‌మ ఆధీనంలోకి తీస‌కున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top