గ్లోబల్‌ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్‌.. తవ్వి తీసి వెదజల్లడమే! | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్‌.. తవ్వి తీసి అంతరిక్షంలోకి వెదజల్లడమే!

Published Sat, Feb 18 2023 4:49 AM

Launching Dust From the Moon Could Help Cool Earth - Sakshi

చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్‌ వార్మింగ్‌ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!!

ఏమిటీ ప్రతిపాదన...?
చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన.

ఏమిటి సమస్య?
► చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే...
► అన్నింటికంటే ముందుగా చంద్రునిపై భారీ సైజులో ఓ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూళిని తవ్వి పోసే పరికరాలు తదితరాలను అక్కడికి చేరేసుకోవాలి.
► గత 50 ఏళ్లలో మనిషి చంద్రునిపై కాలు పెట్టలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా ఎంత కష్టమో అర్థమవుతుంది.
► రాజకీయంగా చూస్తే ఈ మొత్తం ప్రయోగానికి ఎవరు సారథ్యం వహించాలి, ఇందులో ఏ దేశం పాత్ర ఎంతమేరకు, ఎలా ఉండాలన్నది మరో పెద్ద ప్రశ్న. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం ఇప్పటికే పెద్ద దేశాల మధ్య పోటీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ కేవలం ఓ పర్యావరణ లక్ష్యసాధన కోసం ఆభిజాత్యాలను పక్కన పెట్టి అవన్నీ ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే.
► అంతరిక్షంలో భూమికి, సూర్యునికి మధ్య ప్రాంతమంతా పలు దేశాలు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలతో నిండిపోయి ఉంది!
► ఇన్ని కష్టాలూ పడి ఒకవేళ విజయవంతమైనా ధూళిని వెదజల్లే ఉపాయం తాత్కాలిక ఫలితాలే ఇస్తుంది తప్ప గ్లోబల్‌ వార్మింగ్‌కు శాశ్వతంగా అడ్డుకట్టు వేసే స్థాయిలో దీర్ఘకాలికంగా పెద్దగా ప్రయోజనం కన్పించకపోవచ్చని కొందరు సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు.  


చంద్రధూళే ఎందుకు?
► భూమిపై పడే సూర్యరశ్మి పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించడం ద్వారా భూమిని చల్లబరచాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నవే. దీన్ని సోలార్‌ జియో ఇంజనీరింగ్, సోలార్‌ రేడియేషన్‌ మేనేజ్‌మెంట్‌గా పిలుస్తున్నారు.
► భూ వాతావరణపు పై పొరలోకి వాయు కణాలతో కూడిన సన్నని లేయర్‌ను పంపి భూమిపైకి వచ్చే సూర్యరశ్మిని కొద్దిమేరకు అడ్డుకోవాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇలా వాతావరణపు పొరలతో చెలగాటమాడితే భూమిపై పలు ప్రాంతాల్లో వర్షపాతం తదితరాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్న భయాల నేపథ్యంలో దానిపై ముందడుగు పడలేదు.
► మరికొందరు అంతరిక్షంలో భారీ అద్దాలు, లేదా ఫిల్టర్లను ఉంచాలని సూచించినా అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు.
► అదే చంద్రధూళిని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలేవీ లేకుండానే దిగ్విజయంగా పని పూర్తవుతుందన్నది తాజా యోచన.
► ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై అది అపారంగా అందుబాటులో ఉంది.
► గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చంద్రుని పై నుంచి ధూళి మేఘాలను అంతేగాక భూమి పై నుంచి జరిపే ఏ ప్రయోగంతో పోల్చినా అత్యంత తక్కువ వ్యయ ప్రయాసలతో సులువుగా అంతరిక్షంలోకి తరలించవచ్చు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement