పోలీస్‌ క్యాంప్‌పై విరుచుకుపడిన 150 మంది బందిపోట్లు.. ఐదుగురు పోలీసులు మృతి

A Large Group Of Armed Bandits Attacked A Police Camp In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: దారి దోపిడిలో భాగంగా బందిపోట్లు దాడి చేయటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఎదురించిన వారిని విచక్షణరహితంగా చంపి దోపిడి చేస్తుంటారు. అలాంటి షాకింగ్‌ సంఘటనే పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రంలో వెలుగు చూసింది. అయితే, తమపై ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులపై దాడికి దిగింది దొంగల ముఠా. రోంటి రీజియన్‌ కచా ప్రాంతంలోని ఓ పోలీసు క్యాంపుపై భారీ సంఖ్యలో బందిపోట్లు ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

డీఐజీ జావేద్‌ జాస్కాని తెలిపిని వివరాల ప్రకారం.. కచా ప్రాంతంలో దుండగుల ఆక్రమణలు పెరిగిపోయిన క్రమంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. అయితే, ఒక్కసారిగా 150 మంది బందిపోట్లు పోలీసు పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఓ డీఎస్‌పీ, ఇద్దరు ఎస్‌హెచ్‌ఓలతో పాటు మొత్తం ఐదుగురు పోలీసులను హత్యచేశారు. మృతులు డీఎస్‌పీ అబ్దుల్‌ మాలిక్‌ భుట్టో, ఎస్‌హెచ్‌ఓ అబ్దుల్‌ మాలిక్‌ కమాన్‌గర్‌, ఎస్‌హెచ్‌ఓ డీన్‌ ముహమ్మద్‌ లెహారి, ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు సలీమ్‌ చాచాదర్‌, జటోయ్‌ పటాఫిలుగా గుర్తించారు. 

పోలీసు క్యాంపుపై బందిపోట్లు దాడి చేసిన క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భారీగా బలగాలను కచా ప్రాంతానికి తరలించారు. బందిపోట్లు దాడి చేసినప్పటికీ తమ ఆపరేషన్‌ కొనసాగుతుందని తెలిపారు డీఐజీ. మరోవైపు.. పోలీసులపై దాడిని ఖండించారు పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఛైర్మన్‌, విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారి. పోలీసుల ప్రాణాలు తీసిన దండగులు తగిన శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పాక్‌లోని చైనీయులకు బులెట్‌ ప్రూఫ్‌ కార్లు.. ‘ఇమ్రాన్‌’ కాల్పులే కారణమా?   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top