వారానికి కనీసం 150 నిమిషాలు: లాన్సెట్‌ జర్నల్‌

The Lancet: Urgent action to improve physical activity worldwide - Sakshi

ప్రతి నలుగురిలో ఒకరు కనీసశ్రమపై ఆసక్తి చూపడం లేదు 

వ్యాయామం లేకుంటే జీవనశైలి వ్యాధుల ప్రమాదం 

టెక్నాలజీ, గాడ్జెట్ల ప్రభావంతో శారీరక శ్రమకు దూరంగా జీవనం

వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం ఉండాలంటున్న లాన్సెట్‌ జర్నల్‌ పరిశోధన 

ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్‌ జర్నల్‌ లాన్సెట్‌ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌:  ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్‌స్క్రీన్‌పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్‌ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్‌ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్‌లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

శారీరక శ్రమకు పావువంతు మంది దూరం 
ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్‌ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్‌ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ఒకదానికొకటి అనుసంధానం 
నడక, సైక్లింగ్‌ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్‌ వార్మింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచి్చంది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్‌వర్క్, హోమ్‌వర్క్‌ ఇవ్వాలి. యాక్టివ్‌ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది.

పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు 
♦ శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే.  
♦ ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు.  
♦ రోజుకు సగటున 20-30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. 
♦ దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. 
♦ ప్రపంచవ్యాప్తంగా 10-24 సంవత్సరాల మధ్య వయసువాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం ఫిజికల్‌ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. 
♦ 2008 నుంచి గూగుల్‌లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్‌ పెరుగుతూ వస్తోంది. 

చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 
2020 ప్రొజెక్టెడ్‌ సెన్సెస్‌ ప్రకారం చైల్డ్‌హుడ్‌ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్‌ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. -డాక్టర్‌ కిషోర్‌ ఈగ,  పీడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ 

కోవిడ్‌తో మారిన జీవనశైలి 
ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్‌-19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన్‌ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్‌ సురేశ్‌ చీకట్ల, స్పైన్‌ సర్జన్, కిమ్స్‌ 
ముందస్తు వ్యూహం అవసరం 
వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కల్పించడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి.  – డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌ వైద్య కళాశాల  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top