ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏతో కలిసి మరోసారి సైనిక స్థావరాలను సందర్శించారు. ఒక ఆధునిక యుద్ధ ట్యాంక్‌ను నడిపారు. నల్లటి తోలు జాకెట్లు ధరించిన తండ్రీకూతుళ్లు, ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. తన కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకుని శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
డ్రోన్లు లక్ష్యాలను ఛేదించడం, సైనికులు రైఫిల్ షూటింగ్ చేయడం వంటి ప్రత్యక్ష సైనిక వ్యాయామాలను దగ్గరుండి పర్యవేక్షించారు. 420 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులను కూడా గురిపెట్టే లక్ష్యంతో ఈ డ్రిల్ జరిగినట్లు సమాచారం. ట్యాంక్ యూనిట్లు, పదాతి దళాలతో కూడిన కాల్పులు, ఇతర విన్యాసాలను కిమ్ పర్యవేక్షించారని, యుద్ధ సన్నాహాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) తెలిపింది.
కిమ్ జు–ఏ 2022 నుంచే తన తండ్రితో కలిసి హై–ప్రొఫైల్ సైనిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. గత వారమే తండ్రీకూతుళ్లిద్దరూ ఒక తేలికపాటి ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. పిస్టల్స్‌తో కాల్పులు జరిపారు. పలు రాకెట్ ప్రయోగ వ్యవస్థల ప్రత్యక్ష కాల్పుల పరీక్షను వీక్షించారు. అంతేకాదు కిమ్ జు–ఏ గత సెపె్టంబర్‌లో తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లింది. నూతన సంవత్సర వేడుకల్లోనూ పాల్గొంది. ఈ వరుస చర్యల నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ ఆమెను త్వరలోనే తన వారసురాలిగా ప్రకటించనున్నారని దక్షిణ కొరియా గూఢచార సంస్థ కూడా అంచనా వేసింది. ఇది తదుపరి వారసురాలు ఆమె కావచ్చనే ఊహలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఈ సైనిక విన్యాసాలు కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, అమెరికా, ఇతర దేశాలకు యుద్ధానికి సిద్ధమనే హెచ్చరికగా భావిస్తున్నారు.


