నార్త్‌ కొరియా కిమ్‌ ‘బిగ్‌’ వార్నింగ్‌.. టెన్షన్‌లో అమెరికా..!

Kim Jong Un Has Vowed To Develop More Powerful Means Of Attack - Sakshi

సియోల్‌: వరుస క్షిపణి ప‍్రయోగాలతో నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్న బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 11 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా తాజాగా మార్చి 25వ తేదీన అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి హ్వాసాంగ్‌–17ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి 1,090 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా, జపాన్‌ మధ్య సముద్ర జలాల్లో లక్ష్యంపై పడిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో​ సోమవారం మరో సంచలన ప్రకటన చేశారు. తన సైన్యాన్ని మరింత శక్తివంతం చేసేందుకు అత్యాధునిక క్షిపణులను తయారు చేసి ప్రయోగించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా కిమ్‌.. ఎవరూ ఆపలేని అఖండ సైనిక శక్తి సామార్థ్యాలు కలిగి ఉన్నప్పుడే.. ఓ వ్యక్తి యుద్ధాన్ని నిరోధించగలడని అన్నారు. అప్పుడే సామ్రాజ్యవాదుల బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్స్‌ అన్నింటినీ అదుపులో ఉంచగలడంటూ వ్యాఖ్యలు చేసినట్టు కేసీఎన్‌ఏ పేర్కొంది. దీంతో పరోక్షంగా అమెరికాకు కిమ్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కిమ్‌ తమ ఆత్మరక్షణ దళాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

మరోవైపు.. క్షిపణి ప్రయోగాల పట్ల దక్షిణ కొరియా, జపాన్, అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తరకొరియా ధిక్కరిస్తోందంటూ అమెరికా అభ్యంతరం తెలిపింది. బాల్లిస్టిక్ క్షిపణుల ప్రయోగాలకు ఉత్తర కొరియా పాల్పడుతోందని, ఖండాంతర మిస్సైల్‌ను టెస్ట్ ఫైర్ చేయడాన్ని క్షమించలేమని జపాన్ పేర్కొంది. కాగా, అణ్వస్త్రాల ప్రయోగాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ఇది వరకే అమెరికా, ఉత్తర కొరియా మధ్య చర్చలు జరిగాయి. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌ జోంగ్‌ ఉన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తరువాత ఉత్తర కొరియాపై అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది. దీంతో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ క్షిపణి ప‍్రయోగాలను వేగవంతం చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top