ఇజ్రాయెల్‌.. ‘సంస్కరణం’

Israelis Protesting Against Benjamin Netanyahu - Sakshi

చట్టంపై ఉక్కుపాదం.. ప్రభుత్వంపై నిరసన గళం

ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థలో భారీ మార్పులు 

ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా సుప్రీంకోర్టు! 

ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ ప్రతిపాదనలు 

వ్యతిరేకిస్తున్న ప్రజలు.. నిరసనలు, ఆందోళనలు ఉధృతం 

పదవి కాపాడుకోవడానికే నెతన్యాహూ డ్రామాలంటున్న ప్రత్యర్థులు

నిరసనలు, ఆందోళనలు, సమ్మెలతో గత మూడు నెలలుగా ఇజ్రాయెల్‌ అట్టుడికిపోతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది జనం నిత్యం వీధుల్లోకి వస్తున్నారు. బెంజమిన్‌ నెతన్యాహూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. కార్మికులు సమ్మె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. ఇవి గొప్ప సంస్కరణలని నెతన్యాహూ అనుకూల వర్గాలు ఊదరగొడుతున్నప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు.

న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు దేశ ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తాయని, తాము హక్కులు కోల్పోతామని వారు ఆరోపిస్తున్నారు. మార్పులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోయావ్‌ గల్లాంట్‌ను ఆదివారం హఠాత్తుగా పదవి నుంచి తొలగించడం మరింత అగ్గి రాజేస్తోంది. నెతన్యాహూ సర్కారు నియంతృత్వ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు, వాటిపై ప్రజల భయాందోళన వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

ఏమిటీ సంస్కరణలు
► 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్‌లో లిఖిత రాజ్యాంగం లేదు.  
► నోటిమాటగా కొన్ని రాజ్యాంగ ప్రాథమిక చట్టాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం   ఇజ్రాయెల్‌లో సుప్రీంకోర్టే శక్తివంతం.  
► ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ అయిన ‘నేస్సెట్‌’పై      నియంత్రణ అధికారం సుప్రీంకోర్టుకే ఉంది.  
► నెతన్యాహూ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నకొత్త సంస్కరణల ప్రకారం మొత్తం న్యాయ వ్యవస్థపై పార్లమెంట్‌కే అధికారాలు ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలదే అసలు పెత్తనం.
► న్యాయమూర్తులను ఎలా నియమించాలి? ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు      ఉంటుంది.  
► ఇజ్రాయెల్‌ జ్యుడీషియరీలో ఇలాంటి భారీ మార్పులను ప్రతిపాదిస్తుండడం ఇదే మొదటిసారి.  
► సుప్రీంకోర్టు అనేది ఇజ్రాయెల్‌ ప్రజలకు సంబంధం లేని గ్రూప్‌గా మారిపోయిందని నెతన్యాహూ మద్దతుదారులు వాదిస్తున్నారు. న్యాయస్థానం పరి ధి మీరి వ్యవహరిస్తోందని, సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తోందని విమర్శిస్తున్నారు.  
► ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వంలో న్యాయస్థానం జోక్యం ఏమిటని వారు మండిపడుతున్నారు.  

► అమెరికా లాంటి దేశాల్లో జడ్జీల నియామక వ్యవస్థను రాజకీయ నాయకులే నియంత్రిస్తారని నెతన్యాహూ గుర్తుచేస్తున్నారు. తద్వారా తన చర్యలను సమర్థించుకుంటున్నారు.  
► ఇజ్రాయెల్‌లో జడ్జీలను నియమించే తొమ్మిది మంది సభ్యుల కమిటీలో మెజార్టీ సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులే ఉండేలా ఆయన ఒక బిల్లును తీసుకొచ్చారు.  
► పార్లమెంట్‌ చేసిన కొన్ని చట్టాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పులు వెలువరించింది. అలాంటి చట్టాలను మళ్లీ ఆమోదించే అధికారం పార్లమెంట్‌కు ఉండాలని(ఓవర్‌రైడ్‌ క్లాజ్‌) నెతన్యాహూ ప్రతిపాదిస్తున్నారు.  
► పదవిలో ఉన్న ప్రధానమంత్రిని కుర్చీ నుంచి దించేయాలంటే మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది మద్దతు తప్పనిసరిగా ఉండాలన్నది మరో కీలక ప్రతిపాదన.  
► శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకపోతేనే ప్రధానమంత్రిని తొలగించాలని, ఇతర కారణాలతో కాదని    ఇంకో ప్రతిపాదన చేశారు.  

నెతన్యాహూకు ప్రయోజనమేంటి?  
► ప్రధానమంత్రి నెతన్యాహూపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనపై మోసం, లంచం తీసుకోవడం, విశ్వాస ఘాతుకానికి పాల్పడడం వంటి ఆరోపణలు ఉన్నాయి.  
► తాను ఏ తప్పూ చేయలేదని నెతన్యాహూ చెబుతున్నప్ప టికీ ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ప్రత్య ర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.  
► పదవిని కాపాడుకోవడానికే న్యాయ వ్యవస్థలో సంస్కరణల పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్నారు.  
► అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న నెతన్యాహూ సుప్రీంకోర్టుతో ఓ ఒప్పందానికి వచ్చి ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయన ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కాకూడదు.  కానీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలంటూ విధానపరమైన నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ప్రధానిగా  ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఇజ్రాయెల్‌ అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తదుపరి ఏం జరగొచ్చు?
జ్యుడీషియరీలో మార్పుల ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకొనేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రజలు తేల్చిచెబుతున్నారు. పోరాటం మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని ప్రభుత్వం చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు ప్రజామోదం లభించిందని నెతన్యాహూ అనుచరులు పేర్కొంటున్నారు. అయితే జనాందోళనకు తలొగ్గి, సంస్కరణలను నెలపాటు  వాయిదా వేస్తున్నట్టు నెతన్యాహూ తాజాగా ప్రకటించారు. మరోవైపు ఈ ఉదంతంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అంతర్గత సంఘర్షణ నెలకొనే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు.

ప్రత్యర్థుల అభ్యంతరాలు
జడ్జీలను నియమించే అధికారం నెతన్యాహూ, ఆయన మిత్రుల చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తప్పదని ప్రత్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా పనిచేసే జడ్జీలను నియమించుకొని, అవినీతికి సంబంధించిన కేసుల నుంచి బయటపడి, అధికారంలో సుదీర్ఘ కాలం కొనసాగాలన్నదే నెతన్యాహూ ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. న్యాయ వ్యవస్థ సర్వ స్వతంత్రంగా పనిచేయాలని, అందులో ఇతరుల పాత్ర ఉండరాదని నెతన్యాహూ గతంలో గట్టిగా వాదించారు. ఇండిపెండెంట్‌ జ్యుడీషియరీకి మద్దతు పలికారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు ఆక్షేపిస్తున్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే హద్దుల్లేని, నియంత్రణ లేని న్యాయ వ్యవస్థ కాదని నెతన్యాహూ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.  

ప్రజలకు నష్టమే!  
ఇజ్రాయెల్‌ న్యాయ వ్యవస్థ బలహీనపడితే కేవలం ఇజ్రాయెల్‌ పౌరులకే కాదు, పాలస్తీనా ప్రజలకు సైతం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న వెస్ట్‌బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారికి రెసిడెన్సీ కార్డులు ఉన్నాయి. హక్కులకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వం నుంచి వేధింపులు పెరిగినప్పుడు, ప్రమాదంలో ఉన్నామని భావించినప్పుడు ప్రజలు ఇకపై కోర్టులను ఆశ్రయించలేరని, ఒకవేళ కోర్టుకెళ్లినా న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే కోర్టులు ఆడాల్సి ఉంటుందని, అవి ప్రజలకు రక్షణ కల్పించలేవని అభిప్రాయపడుతున్నారు. కోర్టులపై రాజకీయ నాయకుల పెత్తనం మొదలైతే ఇజ్రాయెల్‌లోని మైనార్టీల హక్కులకు, జీవితాలకు రక్షణ ఉండదని అంచనా వేస్తున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top