గాజాలో బాంబుల మోత

Israel launches new strikes on Gaza as calls for ceasefire grow - Sakshi

మరో ఆరుగురు పాలస్తీనియన్ల మృతి

వైమానిక దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌

గాజా సిటీ/వాషింగ్టన్‌: పాలస్తీనా హమాస్‌ మిలటరీ విభాగం లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు యథాతథంగా కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం గాజా స్ట్రిప్‌పై బాంబు వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను విరమించాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌ సైన్యం లెక్కచేయడం లేదు. హమాస్‌ రాకెట్‌ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెబుతోంది.

శత్రువులను బలహీనపర్చడానికి వైమానిక దాడులను ఉధృతం చేస్తామని పేర్కొంటోంది. తాజాగా ఇజ్రాయెల్‌ దాడుల్లో దక్షిణ గాజా టౌన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 40 మంది నివసించే భవనం నేలమట్టమయ్యింది. ఖాన్‌ యూనిస్, రఫా పట్టణాల్లో 40 సొరంగాలను ధ్వంసం చేయడానికి 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇజ్రాయెల్‌ ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 219 మంది పాలస్తీనియన్లు మరణించారు. 58 వేల మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలేసి  సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక హమాస్‌ రాకెట్‌ దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతిచెందారు.

హింసను ఇకనైనా ఆపండి: జో బైడెన్‌
గత పది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాగుతున్న హింసాకాండకు ఇకనైనా స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు సూచించారు. ఇరువురు నేతలు బుధవారం ఫోన్‌ ద్వారా మాట్లాడుకున్నారు. ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలని బైడెన్‌ నొక్కిచెప్పారు.  ఆ తర్వాత నెతన్యాహు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది. తన లక్ష్యం నెరవేరేదాకా దాడులు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్‌ చర్యలపై పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top