గాజాలో ఇజ్రాయెల్‌ మట్టిగోడ | Israel is building a miles-long earthen barrier inside Gaza | Sakshi
Sakshi News home page

గాజాలో ఇజ్రాయెల్‌ మట్టిగోడ

Jul 22 2026 5:24 AM | Updated on Jul 22 2026 12:26 PM

Israel is building a miles-long earthen barrier inside Gaza

కైరో: ఒకపక్క ఇరాన్‌తో వైరం సాగుతూండగానే ఇంకోపక్క ఇజ్రాయెల్‌ గుట్టుచప్పుడు కాకుండా గాజాపై తన పట్టు బిగిస్తోంది. గత ఏడాది అక్టోబరులో హమాస్‌తో కుదరిన కాల్పుల విరమణ ఒప్పందం కింద గీసిన సరిహద్దు రేఖ వెంబడి భారీ మట్టి గోడను కట్టేస్తోంది. ఇప్పటికే సుమారు 23 కిలోమీటర్ల మేర ఈ గోడ నిర్మాణం పూర్తయినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ పని పూర్తయితే గాజాలోని సగం ప్రాంతంపై ఇజ్రాయెల్‌ తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నట్లు అవుతుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే హమాస్‌తో జరిగిన ఒప్పందంలో గీసుకున్న సరిహద్దు తాత్కాలికం కావడం! ఇజ్రాయెల్‌ గీస్తున్న ఈ కొత్త సరిహద్దు వెంబడే నిఘా, గూఢచార వ్యవస్థలతో కూడిన ఒక సెక్యూరిటీ జోన్‌ కూడా ఏర్పాటవుతోంది. దక్షిణ గాజాలో రఫా, మువాసి ప్రాంతంలో జూలై ఒకటవ తేదీ నాటికి కేవలం అర కిలోమీటరు పొడవున్న గోడ కాస్తా 15 రోజుల్లోనే 2.4 కిలోమీటర్లకు పెరిగింది. గాజా సమీపంలోని ఖాన్‌ యూనిస్‌ వద్ద ఏకంగా 17 కిలోమీటర్ల పొడవైన మట్టి గోడను ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసింది. మట్టి, కాంక్రీట్‌ దిబ్బల్లా మారిన పాలస్తీనా గ్రామాలే పునాదులుగా ఈ ప్రాంతంలో కొత్త రహదారులు, మిలటరీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. 

చొరబాట్లను అడ్డుకునేందుకు.. 
కొత్తగా నిర్మిస్తున్న మట్టి గోడ చొరబాట్లను అడ్డుకునేందుకే అని ఇజ్రాయెల్‌ చెబుతున్నా అది శాశ్వత సరిహద్దుగా మారే ప్రమాదముందని పాలస్తీనీయులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే గాజా ప్రాంతం పరిస్థితి మరింత దిగజారిపోతుంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తరువాత ఇజ్రాయెల్‌ పూర్తిగా వెనక్కు తగ్గిపోతుందని, ఆ తరువాత అంతర్జాతీయ భద్రత సంస్థల నేతృత్వంలో ఆ ప్రాంత పర్యవేక్షణ చేపట్టవచ్చునని అనుకన్నారు కానీ... ఇప్పుడు ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందం మొదలైన తరువాత కూడా పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆగలేదు.

ఇప్పటివరకూ సుమారు 1100 మంది పాలస్తీనీయులు ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉగ్రవాదుల దాడుల్లో ఐదుగురు ఇజ్రాయెల్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మంగళవారం గాజా పట్టణంపై జరిగిన ఒక వైమానిక దాడిలో ఫిరాసల్‌ మస్రీ అనే వ్యక్తితోపాటు అతడి భార్య, నలుగురు సంతానం కన్ను మూసినట్లు షిఫా ఆసుపత్రి ప్రకటించింది.

ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుపోగా తమని రక్షించమని చిన్న పిల్లలు అరుస్తూండటం తన చెవినపడినట్లు మస్రీ సోదరుడు తెలిపారు. 2023 అక్టోబర్‌ ఏడున హమాస్‌ ఇజ్రాయెల్‌లో జరిపిన దాడిలో 1200 మంది మరణించారు. ఇరు ప్రాంతాల మధ్య తాజా యుద్ధానికి కారణమైన ఈ ఘటన తరువాత ఇప్పటివరకూ గాజాలో సుమారు 73 వేల మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement