టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న మహిళ బీటా హెమ్మతికి మరణశిక్ష విధించాలని నిర్ణయించింది. నిరసనలకు గాను మరణశిక్షకు గురైన తొలి మహిళగా బీటా నిలిచింది. ప్రస్తుతం మరణశిక్ష ఖైదీలుగా ఉన్న నలుగురిలో ఆమె ఒకరు. బీటాతో పాటు ఆమె భర్త మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్‌కూ మరణశిక్ష విధించాలని అధికారులు నిర్ణయించారు.
వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన, పదుల వేల మంది అరెస్టులకు దారితీసిన నిరసనలలో పాల్గొన్నందుకు ఇరాన్ ఇప్పటివరకు ఏడుగురికి ఉరిశిక్ష అమలు చేసింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త యుద్ధం నేపథ్యంలో మరణశిక్షల అమలుపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్, అతని భార్య బీటా హెమ్మతి, బెహ్రూజ్ సమనేజాద్, కౌరోష్ సమనేజాద్‌లకు విధించనున్న మరణశిక్షపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా జోక్యం తర్వాత, జనవరి నిరసనల్లో అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీ (26)కి విధించిన మరణశిక్షను ఇరాన్ తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశ భద్రతకు హాని కలిగించడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం వంటి ఆరోపణలు ఉన్నప్పటికీ, అటువంటి నేరాలకు మరణశిక్ష విధించరాదని కొత్త వివరణ ఇచ్చారు.
జనవరి 10న నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీకి జనవరి 14న ఉరిశిక్ష అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. అనంతరం అనూహ్యంగా వాయిదా వేసి, అతనిపై విధించిన ఆరోపణలు మరణశిక్షకు తగినవి కావని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం మరణశిక్షకు గురైన ఇతర ఖైదీల విషయంలో ట్రంప్ మౌనం వహిస్తున్నారు.


