సెల్‌ఫోన్‌ తయారీ ఐడియా ఎలా వచ్చిందో తెలుసా?

Innovations Based On Science Fiction Stories - Sakshi

సైన్స్‌ ఫిక్షన్లు అంటే చాలా మందికి ఇష్టం.. అవి బుక్స్‌ అయినా, సినిమాల్లో అయినా.. మనం ఊహించలేని ఏవేవో అద్భుతమైన టెక్నాలజీలు, చిత్రవిచిత్రమైన పరికరాలు, విజువల్‌ వండర్స్‌ భలే ఆకట్టుకుంటాయి. మరి ఈ సైన్స్‌ ఫిక్షన్లు కేవలం వినోదం కోసమేనా? చాలా మందికి అంతే. కానీ.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ సైన్స్‌ ఫిక్షన్‌ పుస్తకాల్లో రాసిన, ఆ సినిమాల్లో చూపించిన టెక్నాలజీని స్ఫూర్తిగా తీసుకుని.. గొప్ప ఆవిష్కరణలు చేశారు. అవేవో అల్లాటప్పా వస్తువులు కూడా కాదు.. మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆవిష్కరణలు అవి. మరి ఈ విశేషాలేమిటో తెలుసుకుందామా? 

‘స్టార్‌ ట్రెక్‌’ నుంచి సెల్‌ఫోన్‌
ప్రపంచవ్యాప్తంగా ఊపుఊపిన ‘స్టార్‌ ట్రెక్‌’ సిరీస్‌ సినిమాల్లో హీరో క్యారెక్టర్‌.. స్పేస్‌ కెప్టెన్‌ కిర్క్‌ ఓ కమ్యూనికేటర్‌ డివైజ్‌ వాడుతుంటాడు. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్‌ఫోన్‌ తరహాలోని చిన్న డివైజ్‌తో వైర్‌లెస్‌గా ఇతరులతో కమ్యూనికేట్‌ అవుతుంటాడు. 1966 నాటి స్టార్‌ ట్రెక్‌ సినిమాలో ఈ సీన్లు ఎంతో ఆకట్టుకున్నాయి. దాని నుంచి స్ఫూర్తి పొందిన మార్టిన్‌‌ కూపర్‌ అనే మోటరోలా కంపెనీ శాస్త్రవేత్త 1973లో సెల్‌ఫోన్‌ తయారు చేశాడు. తొలిసారిగా కాల్‌ చేసి ఇతరులతో మాట్లాడాడు. నాటి సెల్‌ఫోన్‌ ఓ పెద్ద ఇటుక అంత సైజులో ఉండేది. 

నవల హెలికాప్టర్‌ను తెచ్చింది
ఇగోర్‌ సికోర్‌స్కీ.. ఇప్పుడు మనం వాడుతున్న అత్యాధునిక హెలికాప్టర్‌ ఆవిష్కర్త.1936లో ఆయన తొలి పూర్తిస్థాయి హెలికాప్టర్‌ను విజయవంతంగా రూపొందించి, నడిపారు. మరి హెలి కాప్టర్‌ తయారీపై ఆయనకు స్ఫూర్తినిచి్చంది ఏమిటో తెలుసా? అప్పటి ప్రపంచ ప్రఖ్యాత రచయిత జూల్స్‌ వెర్న్‌ 1886లో రాసిన ‘క్లిప్పర్‌ ఆఫ్‌ క్లౌడ్స్‌’ అనే నవల. గాల్లో ఎగిరే ఓ పెద్ద వాహనం, దానితో సాగే యుద్ధమే.. ఆ నవల ఇతివృత్తం. ఇగోర్‌ సికోర్‌స్కీ తన చిన్నతనంలో ఆ నవలను చదివానని.. అలా గాల్లో ఎగిరే వాహనాన్ని తయారు చేయాలన్న తపన అప్పుడే మొదలైందని చాలాసార్లు చెప్పారు.

నీటి అడుగున అడ్వెంచర్‌.. సబ్‌మెరైన్‌ 
జూల్స్‌ వెర్న్‌ 1870లోనే ‘ట్వంటీ థౌజండ్‌ లీడ్స్‌ అండర్‌ ది సీ’ అనే నవల రాశారు. సముద్రం అడుగున సాహస పోరాటాలు చేసే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ అడ్వెంచర్‌ నవల ఇది. ఇందులో ప్రత్యేక వాహనాల్లో నీటి అడుగున మనుషులు ప్రయాణిస్తుంటారు. దీనిని స్ఫూర్తిగా తీసుకునే.. సిమన్‌ లేక్‌ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి విజయవంతమైన జలాంతర్గామి ‘ఆర్గోనాట్‌’ను తయారు చేశారు. మరో విశేషం ఏమిటంటే.. అమెరికా నేవీ 1954లో తయారు చేసిన అత్యాధునిక జలాంతర్గామికి ‘నౌటిలస్‌’ అని పేరుపెట్టింది. ‘నౌటిలస్‌’ ఏమిటో తెలుసా?.. జూల్స్‌ వెర్న్‌ నవలలో నీటి అడుగున ప్రయాణించే వాహనం పేరే అది.

గ్రహాంతర వాసుల యుద్ధంతో రాకెట్‌ 
ప్రఖ్యాత రచయిత హెచ్‌జీ వెల్స్‌ 1897లో రాసిన నవల ‘ది వార్‌ ఆఫ్‌ది వరల్డ్స్‌’. గ్రహాంతర వాసులు రాకెట్లలో భూమ్మీదికి రావడం, ఇక్కడ అల్లకల్లోలం సృష్టించడం, మనవాళ్లు రాకెట్లు తయారు చేసి వారిని తిరిగి పంపేయడం ఇతివృత్తంగా ఈ నవల సంచలనం సృష్టించింది. ఈ నవల పేరుతోనే పలు హాలీవుడ్‌ సినిమాలూ వచ్చాయి. ఈ నవలను స్ఫూర్తిగా తీసుకున్న శాస్త్రవేత్త రాబర్ట్‌ గొడ్డార్డ్‌ మొట్టమొదటి స్పేస్‌ రాకెట్‌ను తయారు చేశారు. 1926లో విజయవంతంగా ప్రయోగించారు కూడా.

ఆ నవలతోనే అణు బాంబు 
హెచ్‌జీ వెల్స్‌ 1914లో రాసిన మరో నవల ‘ది వరల్డ్‌ సెట్‌ ఫ్రీ’. వెల్స్‌ ఈ నవ లలో దేశాల మధ్య యుద్ధాలు, అణు బాంబుల గురించి రాశారు. కొన్నిరకాల మూలకాలతో విధ్వంసకరమైన, నియంత్రించలేని శక్తిని సృష్టించవచ్చని కథ లో పేర్కొన్నారు. దీని స్ఫూర్తితోనే హంగేరియన్‌ సైంటిస్ట్‌ లియో జిలార్డ్‌.. 1933లో అణు విచి్ఛత్తి, దాని శక్తిని ఆవిష్కరించాడు. తర్వాత అణు రియాక్టర్‌లను అభివృద్ధి చేశాడు. అప్పటికే అణుశక్తి గురించి అంచనాలున్నా.. హెచ్‌జీ వెల్స్‌ నవల, విస్తృతస్థాయిలో అణుశక్తి ఏమిటనేది ఆ నవలతోనే స్ఫూర్తి పొందానని జిలార్డ్‌ ప్రకటించారు. ఈ ప్రయోగాలే 1939లో అమెరికా అణు బాంబును తయారు చేయడానికి దారితీశాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top