అమెరికాలోనే ఉండనివ్వండి.. భారతీయ యువత అభ్యర్ధన 

Indian Youth Face Deportation In US, Seek White House Help - Sakshi

వాషింగ్టన్‌: సరైన అనుమతి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తూ త్వరలో డిపోర్టేషన్‌ (బలవంతంగా సొంతదేశానికి తరలించడం)కు గురికానున్న పలువురు భారతీయ యువతీ యువకులు వైట్‌హౌస్‌ను ఆశ్రయించారు. తమను ఎలాగైనా ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 2లక్షల మంది యువత అమెరికాలోనే తమ బాల్యాన్ని, టీనేజ్‌ను గడిపారు. అయితే వీరికి 21 సంవత్సరాలు దాటినందున ఇకపై పేరెంట్స్‌ వీసాపై అమెరికాలో ఉండేందుకు అనర్హులవుతున్నారు. వీరిలో చాలామంది తల్లిదండ్రులు గ్రీన్‌కార్డు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ కార్డున్న వారికి తమ కుటుంబంతో పాటు అమెరికాలో నివసించే హక్కు లభిస్తుంది.

ఈ నేపథ్యంలో దీప్‌పటేల్‌ తదితరులు ద డ్రీమ్‌ పేరిట ఒక సంఘాన్ని ఏర్పరిచి ఇలాంటి యువతను అమెరికాలో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పలువురు సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యులను కలిసి ఈ విషయమై లాబీయింగ్‌ చేశారు. వీరి యత్నాలకు పలువురు చట్టసభ్యులు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

డాకా(డిఫర్‌డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌) కింద తమలాంటి వారు అమెరికాలో ఉండేందుకు మార్పులు చేయాలని వీరు కోరుతున్నారు. మైనర్లుగా అమెరికా వచ్చిన వారు మేజర్లయ్యాక దేశం వదిలి వెళ్లాల్సిన పనిలేకుండా గతంలో ఒబామా ప్రభుత్వం డాకా చట్టం తెచ్చింది. కానీ, డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో దీన్ని రద్దు చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top