జాహ్నవికి న్యాయం జరగాల్సిందే | Indian Community In The Entire Country And World Demand Justice For Jaahnavi Kandula Death - Sakshi
Sakshi News home page

జాహ్నవికి న్యాయం జరగాల్సిందే

Published Sat, Sep 16 2023 4:42 AM

Indian community in the entire country and world demand justice for Jaahnavi Kandula - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే.

25 మైళ్ల స్పీడ్‌ లిమిట్‌ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్‌ ఆడరర్‌ అనే సియాటెల్‌ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి.

అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్‌ చేశారు.

‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్‌ కోరారు. డేనియల్‌ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు.

పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్‌ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్‌ సియాటిల్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యుడు టామీ జె.మోరల్స్‌ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్‌ అసోసియేషన్స్‌ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు.  

జాహ్నవికి మరణానంతరం డిగ్రీ
అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్‌ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ చాన్సలర్‌ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

Advertisement
Advertisement