తప్పుకో.. లేకపోతే తప్పిస్తాం: ట్రంప్‌కు వార్నింగ్‌

House will move to impeach Trump Nancy Pelosi - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికన్‌ ప్రజాస్వామ్య కేంద్రబిందువైన కేపిటల్ భవన్‌పై దాడి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆగ్రహం పెల్లుబికుతోంది. ట్రంప్‌ తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకులేకపోతున్న ట్రంప్‌.. దేశంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే పదవిన నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని అపహ్యస్యం చేసేలా, అమెరికా ఖ్యాతిని అవమానపరిచిన అధ్యక్షుడిని సాగనంపేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉన్నా.. ఆలోపే పదవి నుంచి దింపేయాలని న్యాయసలహాలను తీసుకుంటోంది. దీనిలో భాగంగానే  రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్‌ సభ్యులు పరిశీలిస్తున్నారు. (ట్రంప్‌ స్వీయ క్షమాభిక్ష..?)

తప్పుకో.. లేకపోతే తప్పిస్తాం..
అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్నీ పెలోసి కీలక వ్యాఖ్యలు చేశారు. కేపిటల్‌ భవన్‌పై దాడికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ తప్పుకోవాలని లేకపోతే తామే తప్పించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరిక చరిత్రలో అత్యంత వైఫల్యమైన అధ్యక్షుడిగా వర్ణిస్తూ.. వెంటనే రాజనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు గల దారులను అన్వేషిస్తున్నట్లు పెలోసి వెల్లడించారు. అధ్యక్షుడిని తొలగించాలంటూ మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్‌ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. (తప్పిస్తారా ? తప్పించాలా?)

అమెరికా స్పీకర్‌గా మళ్లీ పెలోసి
అమెరికా ప్రజాప్రతినిధుల సభ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు 80 ఏళ్ళ నాన్సీ పెలోసి అతి స్వల్ప మెజారిటీతో రెండో సారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. నాన్సీ పెలోసి అమెరికాకి ఎన్నికైన ఏకైక మహిళా స్పీకర్‌గా గతంలోనే రికార్డు సృష్టించారు. ఐదుగురు డెమొక్రాట్లు ఆమెకు ఓటు వెయ్యకూడదని నిర్ణయించుకొని ప్లేటు ఫిరాయించడంతో గందరగోళం ఏర్పడింది. అయితే స్వల్ప మెజారిటీతో నాన్సీ విజయం సాధించారు. రిపబ్లికన్‌ నాయకులు కెవిన్‌ మాక్‌ కార్తీకి 209 ఓట్లు వచ్చాయి. పెలోనీకి 216 ఓట్లు రావడంతో రెండోసారి గెలిచారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టినప్పటి నుంచి, గత రెండు సంవత్సరాలుగా ట్రంప్, పెలోసీకి మధ్య వైరం కొనసాగుతోంది. హౌస్‌లో మొత్తం 435 సీట్లు ఉండగా, 427 మంది సభ్యులు ఓట్లు వేశారు. మిగిలిన వారు కరోనాసోకడంతో క్వారంటైన్‌లో ఉన్నారు. లూసియానా నుంచి ఎన్నికైన మరో సభ్యులు కోవిడ్‌ కారణంగా గత వారం మరణించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top