Afghanistan: నా సోదరిని దారుణంగా చంపేశారు: గోపాల్‌ బెనర్జీ

Gopal Banerjee Recounts Sushmita Banerjee Assassination By Taliban in 2013 - Sakshi

జాతీయ మీడియాతో బెంగాలీ వ్యక్తి వ్యాఖ్యలు

అఫ్గన్‌లో పరిస్థితుల గురించి ఆందోళన

కోల్‌కతా: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న నాటి నుంచి అక్కడి మహిళల పరిస్థితిని తలచుకుని అంతర్జాతీయ సమాజం ఆందోళనకు గురవుతోంది. గత పాలనలో స్త్రీల హక్కులను తీవ్రంగా భంగపరిచిన తాలిబన్లు ఈసారి.. వారికి ఎలాంటి హాని తలపెడతారోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఎలాంటి వివక్షకు తావులేకుండా మహిళలకు అన్ని రంగాల్లో ప్రవేశం కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. ఆ మాటలు నీటి మీద రాతలేనని ఇప్పటికే నిరూపితమైంది.

తమను ఎదిరించిన మహిళా గవర్నర్‌ను బంధించడం సహా.. కో ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన ఫత్వా వారు అవలంబించబోయే వైఖరికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ల చేతిలో హత్యకు గురైన తన సోదరి సుస్మితను గుర్తు చేసుకుని పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపాల్‌ బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గనిస్తాన్‌లో ఎప్పుడు, ఎవరు, ఎందుకు చనిపోతారో తెలియదంటూ ఉద్వేగానికి గురయ్యారు.

భర్తతో కలిసి అఫ్గనిస్తాన్‌కు.. 
బెంగాల్‌కు చెందిన సుస్మితకు 1986లో జాన్‌బాజ్‌ ఖాన్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ అఫ్గనిస్తాన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కాబూలీవాలాస్‌ బెంగాలీ వైఫ్‌ పేరిట సుస్మిత ఓ పుస్తకాన్ని రచించారు.

అఫ్గనిస్తాన్‌లో తన అనుభవాలను రంగరించిన ఆ బుక్‌ను 1997లో పబ్లిష్‌ చేశారు. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్‌లో ఎస్కేప్‌ ఫ్రమ్‌ తాలిబన్‌ అనే సినిమా కూడా తీశారు. కాగా 1994లోనే భర్తతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చిన సుస్మితా.. తన రెండో పుస్తక రచన పూర్తి చేసేందుకు 2013, మేలో మళ్లీ అఫ్గనిస్తాన్‌కు వెళ్లారు. అయితే అప్పటికి అమెరికా సేనలు అఫ్గన్‌లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయి.

ఎప్పటికైనా ప్రమాదమే అని హెచ్చరించినా..
జూలైలో పుట్టింటికి వచ్చిన సుస్మిత.. తన బుక్‌ గురించి సోదరుడు గోపాల్‌ బెనర్జీకి చెప్పింది. కానీ, ఎందుకో అతడి మనసు ఈసారి కీడు శంకించింది. ఈ పుస్తకం తాలిబన్లను ఆగ్రహానికి గురిచేస్తుందని, ఎప్పటికైనా అఫ్గనిస్తాన్‌కు వెళ్లడం ప్రమాదమేనని హెచ్చరించారు. అయితే, సుస్మిత మాత్రం పట్టుదల వీడలేదు. మహిళల పట్ల తాలిబన్ల వైఖరి మారిందని, భావ ప్రకటన స్వేచ్ఛను వారు గౌరవించడం నేర్చుకున్నారని సోదరుడికి సర్దిచెప్పింది. కానీ, ఆమె అభిప్రాయం తప్పని అదే ఏడాది నిరూపితమైంది.

కుటుంబ సభ్యుల కళ్లెదుటే దారుణంగా..
సెప్టెంబరు 4న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాలిబన్లు సుస్మితను ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చారు. జుట్టుపట్టుకుని కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమెను దారుణంగా కాల్చి చంపారు. ఈ విషయాల గురించి గోపాల్‌ బెనర్జీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘అక్కడ మహిళలు చదువుకోవడం నిషేధం. వస్త్రధారణ విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలి.

అయితే, అమెరికా సేనల మోహరింపుతో అఫ్గన్‌లో పరిస్థితులు మారిపోయానని నా సోదరి అనుకుంది. అందుకే మరో పుస్తకం రాసేందుకు 2013లో అక్కడికి వెళ్లింది. ఆరోజు జాన్‌బాజ్‌తో జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. తనతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండగానే తాలిబన్లు వచ్చి వాళ్లను బెదిరించి.. సుస్మితను లాక్కెళ్లి కాల్చి చంపారు’’ అని చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

భయంగా ఉంది..
ఇక ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ... ‘‘నా సోదరి చెప్పిన విషయాలను బట్టి.. ఇప్పటి కంటే గతంలో తాలిబన్లు మరింత క్రూరంగా ప్రవర్తించేవారు. అసలు వాళ్లు ఒక దేశాన్ని పాలించగలరా? ప్రపంచ దేశాలు గళం విప్పాలి. ఎంతో మంది అమాయకులు చచ్చిపోతున్నారు. కొన్ని దృశ్యాలు చూసి నేను షాకయ్యాను. అక్కడ ఎప్పుడు, ఎవరు, ఎందుకు చనిపోతారో వారికే తెలియని దుస్థితి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి: ‘వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు.. తాలిబన్లకు ఇదే నా విజ్ఞప్తి’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top