బంగ్లాదేశ్‌లో దుర్గాదేవి మండపాలు ధ్వంసం

Goons attack Hindu temples in Bangladesh during Durga Puja - Sakshi

ఘర్షణల్లో నలుగురు మృతి

ఢాకా: దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్‌లో దుర్గామాతకి తీవ్ర అపచారం జరిగింది. క్యుమిలియా జిల్లాలో దుర్గా దేవి మండపాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పలు జిల్లాల్లో హిందూ దేవాలయాలపై దాడులకు దిగారు. దుర్గ దేవి కొలువుదీరిన మండపాల వద్ద  ఖురాన్‌ను అపవిత్రం చేశారని  ఆరోపిస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో దుండగులు మండపాలపై దాడికి దిగి ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. అదనపు భద్రతా బలగాలను మోహరించింది. 22 జిల్లాల్లో హై అలెర్ట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకి మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

చాందీపూర్‌ హజీగంజ్, బన్‌షఖాలి, షిబ్‌గంజ్, కాక్స్‌ బజార్‌ తదితర ప్రాంతాల్లో దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా బంగ్లాదేశ్‌ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలపై బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. కాగా ఈ దాడుల వెనుక జమాత్‌–ఇ–ఇస్లామీ హస్తం ఉందని బంగ్లాదేశ్‌ అధికారులు తెలిపారు. షేక్‌ హసీనా ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మచ్చ తీసుకురావడానికి, మత ఘర్షణలు రాజేయడానికే వారు ఈ పని చేశారని చెప్పారు. కొన్ని మండపాల్లో దుర్గమ్మ పాదాల చెంత  పవిత్ర ఖురాన్‌ను ఉంచారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఘర్షణలు చెలరేగాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం దుర్గాదేవి మండపాలు మూడు వేలు ఉన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top