Generation-Z: వీకెండ్‌ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు

Generation Z Is Working for Themselves…and Through the Weekend - Sakshi

పాశ్చాత్యదేశాల్లోనయా ట్రెండ్‌

వారంలో అయిదు రోజులు ఎవరికి వారు

మిగిలిన రెండు రోజులు ఒకరికొకరు

పెళ్లికి జనరేషన్‌ జెడ్‌ కొత్త భాష్యం  

పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టన­ష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది...
ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్‌ జెడ్‌ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది.  ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్‌ మ్యారేజెస్‌ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి...

వీకెండ్‌ మ్యారేజెస్‌ అంటే..?
ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు.  

వీకెండ్‌ కాపురాలకు కారణాలు
► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్‌  వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్‌ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్‌ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు
► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు.  
► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్‌ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు.  
► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్‌పెక్టేషన్‌లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసి­పోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే,  కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్‌ప్రైజ్‌లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది.  
► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.  
► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్‌ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్‌ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్‌ వారికి దొరుకుతుంది.  

భారత్‌లో కుదిరే పనేనా..?
వీకెండ్‌ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్‌ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్‌ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్‌ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్‌ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు.

మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్‌మెంట్‌తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి.

అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన  పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్‌ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది.  

‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’  
– శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్‌

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top