G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే

G7 Summit: PM Narendra Modi strongly calls for reform of United Nations - Sakshi

నేటి అవసరాలను తీర్చేలా లేదు: మోదీ

జీ–7 సదస్సులో ప్రధాని వ్యాఖ్యలు

ఇతరుల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి

అంతర్జాతీయ వేదికపై చైనాకు చురకలు

హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి.

ఇవన్నీ చాలా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్‌ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు.

మీకు మహా డిమాండ్‌!
మోదీతో బైడెన్, ఆల్బనీస్‌ వ్యాఖ్యలు
మీ ఆటోగ్రాఫ్‌ అడగాలేమో: బైడెన్‌

జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్‌ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్‌ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్‌లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్‌ చెప్పుకొచ్చారు.

భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్‌ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్‌ పర్యటన సందర్భంగా గుజరాత్‌లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్‌ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్‌–ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌ను మోదీ, ఆల్బనీస్‌ ప్రారంభించడం తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top