40 ఏళ్ల నాటి అద్దం వెనక భారీ చరిత్ర

Family Stunned That Their Bathroom Mirror Once Belonged To Marie Antoinette - Sakshi

లండన్‌: రోజు లేవగానే బ్రష్‌ చేసుకుంటూ ముఖం చూసుకునే తమ బాత్రూం అద్దం వెనక ఎంతో చరిత్ర ఉందని ఆ కుటుంబానికి తెలియదు. ఆ అద్దాన్ని ఇప్పుడు వేలం వేస్తే 8 వేల పౌండ్లు(7,68,590.90 రూపాయలు) ఖరీదు చేస్తుందని తెలిసి వారు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. ఒక అద్దానికి అంత ఖరీదు ఎందుకు అంటే.. అది ఫ్రాన్స్‌ చివరి రాణి మేరీ ఆంటోనిట్టేకు చెందినది కావడమే కారణం. 19, 15 అంగుళాల కొలత గల ఈ అద్దం 18వ శతాబ్దానికి చెందినదిగా తూర్పు బ్రిస్టల్‌ వేలం కంపెనీ గుర్తించింది. దీని చుట్టూ ఉన్న నగిషీలను 19వ శతాబ్దంలో చెక్కినట్లు గుర్తించారు. ఇక ఫ్రేమ్‌లోని వెండి ఫలకం మీద ఈ అద్దం తొలుత మేరీ ఆంటోనిట్టే వద్ద ఉండేదని తరువాత దాన్ని మూడవ నెపోలియన్‌ భార్య ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని ఉంది. ఇదే కాక మేరీ ఆంటోనిట్టే ఎస్టేట్ నుంచి ఎంప్రెస్‌ యూజీని అనేక వస్తువులను కొనుగోలు చేసిందని సమాచారం. (చదవండి: 60 లక్షలు పలికిన లింకన్‌ వెంట్రుకలు)

ఇక ప్రస్తుతం విషయానికి వస్తే ఒక కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. ‘మా అమ్మమ్మ నుంచి ఈ అద్దాన్ని వారసత్వంగా పొందాము. అయితే దాని నిజమైన విలువను గ్రహించకుండా మా బాత్రూంలో వేలాడదీశాము’ అని తెలిపాడు. ఈస్ట్ బ్రిస్టల్ వేలం ఐడెన్ ఖాన్ మాట్లాడుతూ.. "ఈ అద్దానికి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ పాపం ఇంతకాలం బాత్రూంలో పడి ఉంది. ఇది చరిత్ర నిజమైన భాగం- పద్దెనిమిదవ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వ్యక్తులకు దీనితో దగ్గరి సంబంధం ఉంది" అన్నారు. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చివరి రాణి. లూయిస్‌ 16ని ని వివాహం చేసుకున్నారు. ఆమె 1774 -1792 మధ్య పాలన సాగించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ఉరితీయబడ్డారు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top