
ఎల్ పాసో: అమెరికాలోని ఎల్ పాసో నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో 2019లో కాల్పులు జరిపి 23 మంది మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 90 వరుస జీవిత ఖైదులను విధించింది. దోషి పాట్రిక్ క్రుసియస్(24)పై సుమారు 50 ఫెడరల్ విద్వేష నేరాభియోగాలున్నాయి. దీనిపై జిల్లా కోర్టు విచారణ జరిపి, శిక్షలు ప్రకటించింది. రాష్ట్ర కోర్టులో విచారణకొస్తే మరణ శిక్ష సహా మరిన్ని శిక్షలపై పట్టుబడతామని న్యాయవాదులు అంటున్నారు.
ఈ నేరానికి పాల్పడేందుకు పథకం ప్రకారం క్రుసియస్ డల్లాస్‌లోని సొంతింటి నుంచి ఏకే రైఫిల్‌తో తన వాహనంలో 700 మైళ్ల దూరంలోని ఎల్ పాసోకు వచి్చనట్లు పోలీసులు తెలిపారు. హిస్పానిక్ ప్రజలే లక్ష్యంగా అతడు వాల్ మార్ట్ స్టోర్ లోపల, వెలుపల యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 23 మంది చనిపోగా మరో 25 మంది గాయపడ్డారు. 2006 తర్వాత అమెరికాలో జరిగిన జాత్యహంకార కాల్పుల ఘటనల్లో అత్యంత తీవ్రమైందిగా ఎల్ పాసో ఘటనను పరిగణిస్తున్నారు.