రోడ్డుపై లక్ష దిర్హామ్‌ల నోట్ల కట్ట.. ప్రవాసి నిజాయితీ | dubai expat returns 1 lakh dirhams lost cash | Sakshi
Sakshi News home page

రోడ్డుపై లక్ష దిర్హామ్‌ల నోట్ల కట్ట.. ప్రవాసి నిజాయితీ

May 17 2026 3:45 AM | Updated on May 17 2026 3:53 AM

dubai expat returns 1 lakh dirhams lost cash

ప్రతీకాత్మక చిత్రం

దుబాయ్: రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఏం చేస్తారు.. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా అటూ ఇటూ చూసి వెంటనే జేబులో పెట్టేసుకుంటారు. చాలా మంది చేసేదిదే. అయితే దుబాయ్‌లో ఓ ప్రవాసుడు దీనికి భిన్నంగా నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న లక్ష దిర్హామ్‌ల (భారత కరెన్సీలో రూ. 25 లక్షలకు పైగా) భారీ నగదు కట్టను చూసి ఆశపడకుండా, వెంటనే పోలీసులకు అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

అసలేం జరిగిందంటే?

దుబాయ్‌లోని కరామాలో నివసిస్తున్న రాజ్ అనే ప్రవాస వ్యాపారవేత్త, తన వ్యాపార అవసరాల కోసం స్థానిక బ్యాంకు నుండి 2,60,000 దిర్హామ్‌ల చెక్కును విత్‌డ్రా చేసుకున్నాడు. ఆ నగదును ఒక కవరులో పెట్టుకుని వస్తుండగా, మార్గమధ్యంలో కవరు కొద్దిగా తెరుచుకుని అందులోని ఒక లక్ష దిర్హామ్‌ల కట్ట కింద పడిపోయింది.

ఇంటికి వెళ్లాక గానీ రాజ్ ఈ విషయాన్ని గమనించలేదు. గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారని, ఆ సమయంలో తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన తెలిపాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బ్యాంకు లోపల నగదు అంతా సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే రఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తాను వచ్చిన మార్గంలో వెతకడం ప్రారంభించాడు.

అదే సమయంలో 'అల్ సియారా డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్' యజమాని, ప్రవాసుడైన మహ్మద్ అలీకి రోడ్డుపై పడి ఉన్న నగదు కట్ట కనిపించింది. యుఏఈలో అతి తక్కువ జీతంతో జీవితాన్ని ప్రారంభించి, ప్రస్తుతం ఒక చిన్న టైపింగ్ సెంటర్ నడుపుకుంటున్న అలీ.. ఆ భారీ మొత్తాన్ని చూసి ఎంతమాత్రం సంకోచించకుండా వెంటనే దుబాయ్ పోలీసులకు సమాచారం అందించి, నగదును వారికి భద్రంగా అప్పగించాడు.

మరోవైపు, రోడ్డుపై కారు పక్కన ఆందోళనగా నిలబడి ఉన్న రాజ్‌ను చూసి సమీపంలోని ఒక రెస్టారెంట్ సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం అందించారు. రఫా పోలీస్ స్టేషన్ హ్యాపీనెస్ డివిజన్ అధికారులు కెప్టెన్ అలీ హాజీ హసన్ యూసుఫ్, ఫస్ట్ సార్జెంట్లు ముస్తఫా అబ్దుల్వాలు, అలీ ఖల్ఫాన్‌లు రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేపట్టారు. మహ్మద్ అలీ అప్పగించిన నగదు వివరాలను, రాజ్ కోల్పోయిన వివరాలను సరిపోల్చి, కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఆ సొమ్మును అసలు యజమాని అయిన రాజ్‌కు సురక్షితంగా అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement