ఓట్ల లెక్కింపు ఆపేయండి

Donald Trump speaks after some states stop counting votes for the day - Sakshi

4 రాష్ట్రాల్లో కోర్టుకెక్కిన ట్రంప్‌ మద్దతుదారులు

మెయిల్‌ ఇన్‌ ఓట్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణ

వాషింగ్టన్‌: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్‌ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్‌ చేస్తూ ట్రంప్‌ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్‌ ఇన్‌ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్‌ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్‌ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ..

జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్‌ అనుచరులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

విస్కాన్సిన్‌: విస్కాన్సిన్‌లో విజయం సాధించడంతో జో బైడెన్‌ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్‌ వర్గం పిటిషన్‌ వేసింది. దీనిపై నవంబర్‌ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్‌ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్‌ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్‌ 12 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్‌ వర్గం తీవ్ర అసహనంతో ఉంది.

మిషిగాన్‌: ఈ రాష్ట్ర్‌రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్‌ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్‌ కంటే బైడెన్‌ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పోలింగ్‌కు ముందే వివాదాలు
ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్‌ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్‌కు ముందే ఈ ప్రక్రియను సవాల్‌ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top