అది ఇరాన్‌ ఘాతుకమే  | Donald Trump blames Iran for attacks on Indian ships in Hormuz | Sakshi
Sakshi News home page

అది ఇరాన్‌ ఘాతుకమే 

Jun 13 2026 5:06 AM | Updated on Jun 13 2026 5:06 AM

Donald Trump blames Iran for attacks on Indian ships in Hormuz

భారతీయులున్న నౌకలపై ఇరాన్‌ సైన్యమే డ్రోన్లు ప్రయోగించింది 

ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టీకరణ  

అమెరికా దాడి చేసినట్లు భారత్‌ ప్రకటన  

భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త జాసన్‌ మీక్స్‌కు మళ్లీ సమన్లు  

వాషింగ్టన్‌: ఒమన్‌ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్‌ ఘాతుకమేనని అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం తేల్చిచెప్పారు. హార్మూజ్‌ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్‌ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టుచేశారు. అలాగే శాంతి ఒప్పందంలోని పలు అంశాలను మీడియాకు ఇరాన్‌ లీక్‌ చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మూడు నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ట్రంప్‌ ఇరాన్‌ వైపు వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది.  

ప్రాణాంతక దాడులు ఆపాల్సిందే: భారత్‌  
భారతీయ సిబ్బందితో కూడిన మూడు వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని అంతకుముందు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రాణాంతకమైన, ఘోరమైన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని ఆపాల్సిందేనని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్‌లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త(ఛార్జ్‌ డి అఫైర్స్‌) జాసన్‌ మీక్స్‌కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. తమ విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. 

జాసన్‌ మీక్స్‌కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. నౌకపై భీకర దాడి గురించి తెలిసిన తర్వాత తొలుత బుధవారం రాత్రి సమన్లు ఇచ్చారు. ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో మరోసారి సమన్లు జారీ చేశారు. ‘‘భారతీయ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం కొనసాగిస్తున్న దాడుల పట్ల జాసన్‌ మీక్స్‌కు ఇప్పటికే ఒకసారి తీవ్ర నిరసన తెలియజేశాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం బాధాకరం’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకాయానంపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి దుందుడుకు చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని, క్లిష్ట సమయంలో ఒక సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని తేల్చిచెప్పింది. భారతదేశం తీవ్ర ఆందోళనలను అమెరికా ప్రభుత్వ వర్గాలకు తెలియజేయాలని, అలాగే పశ్చిమాసియాలో పనిచేస్తున్న అమెరికా సైనిక బలగాలు పౌరుల ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అమె రికా దౌత్యవేత్తకు సూచించినట్లు తెలియజేసింది.  

భరతమాత బిడ్డలను మోదీ కాపాడలేరు: రాహుల్‌ గాంధీ 
 న్యూఢిల్లీ: అమెరికా మిలటరీ కాల్పుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో రాజీపడ్డ ప్రధాని భరతమాత బిడ్డలను కాపాడలేకపోయారని, వారి ప్రాణా లను తీసుకున్న వారిని ప్రశ్నించే శక్తి కూడా ఆయనకు లేకపోయిందని శుక్రవారం ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లో అంతర్జాతీయ సముద్ర జలాల్లో మూడు నౌకలపై అమెరికా దాడుల చేసి ముగ్గురు భారతీయులను చంపితే ఇప్పటివరకూ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వచ్చే వారం జరగనున్న జీ–7 సమావేశాల్లోనూ ఆయన నోరు మెదపరని, నవ్వుతూ కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసి వస్తారని, మరణించిన ముగ్గురు నావికుల గురించి ఏమీ మాట్లారని విమర్శించారు.

ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు: ఇరాన్‌  
భారత సిబ్బందితో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడాన్ని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఖాయీ శుక్రవారం ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని తేల్చిచెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అమెరికా చర్యలు నౌకాయాన స్వేచ్ఛకు ప్రమాదం కలిగిస్తున్నాయని ఆరోపించారు. అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని ప్రభుత్వ సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనంగా ఇస్మాయిల్‌ బఖాయీ అభివర్ణించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement