ఐసిస్‌కు బిగ్‌ షాక్‌.. ట్రంప్‌ ప్రకటన | Donald Trump Big Claim Over ISIS Abu Bilal al-Minuki Death | Sakshi
Sakshi News home page

ఐసిస్‌కు బిగ్‌ షాక్‌.. ట్రంప్‌ ప్రకటన

May 16 2026 10:32 AM | Updated on May 16 2026 10:44 AM

Donald Trump Big Claim Over ISIS Abu Bilal al-Minuki Death

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అగ్రకమాండర్‌ అబు బిలాల్‌ మనూకీ హతమయ్యాడు. అమెరికా బలగాలు-నైజీరియా సైన్యం సంయుక్తంగా దాడులు జరిపి అతన్ని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు.  

అబు బిలాల్‌ మనూకీ (ఐసిస్‌ రెండో ఖలీఫా) ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో కార్యకలాపాలు నడిపించేవాడు. అయితే తన ఆదేశాలతో ఇరు దేశాల సైన్యం సాహసోపేతంగా ఆపరేషన్‌ నిర్వహించిందని.. అత్యంత క్లిష్టమైన ఈ మిషన్‌ను జాగ్రత్తగా అమలు చేసి అతని చంపేసిందని ట్రంప్‌ శనివారం తన సోషల్‌ మీడియాలో ప్రకటించారు. “ఇకపై ఆయన ఆఫ్రికా ప్రజలను భయపెట్టలేడు, అమెరికన్లపై దాడులు ప్రణాళిక చేయలేడు” అని ట్రంప్ పేర్కొన్నారు.

ఐసిస్‌లో నెంబర్‌ 2(రెండో ఖలీఫా) అయిన అబుల్‌ బిలాల్‌ చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చాడు. ఆఫ్రికాలోని లోకల్‌ గ్యాంగ్‌లే అతని ఆచూకీ గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మనూకీ మరణంతో ఐసిస్‌కు పెద్ద దెబ్బేనని.. ఐసిస్‌ గ్లోబల్‌ ఆపరేషన్లు బలహీనపడొచ్చనే ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

ఐసిస్‌ నేపథ్యం.. 
ఇరాక్ యుద్ధం తర్వాత “అల్‌-ఖైదా ఇన్ ఇరాక్” (AQI) అనే గ్రూప్‌ నుంచి విడిపోయి.. 2014లో అబూ బకర్ అల్-బగ్దాది నేతృత్వంలో “ఇస్లామిక్ స్టేట్”గా ఖలీఫత్‌(రాజకీయ-మతాధికార వ్యవస్థ) ప్రకటించింది. కాలక్రమంలో.. 2015 పారిస్ దాడులు, 2016 బ్రస్సెల్స్ బాంబులు, 2016 ఒర్లాండో షూటింగ్, మిడిల్‌ ఈస్ట్‌.. ఆఫ్రికాలో అనేక ఆత్మాహుతి దాడులు జరిపి తన మూలాలను విస్తరించుకుంది.

అబూ బకర్ అల్-బగ్దాది (2013–2019), అబూ ఇబ్రాహీం అల్-హషిమీ అల్-ఖురైషీ (2019–2022), ఆపై అబూ అల్-హసన్ అల్-ఖురైషీ (2022), అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సైనీ అల్-ఖురైషీ (2022–2023)లు ఖలీఫాలుగా పని చేశారు. ప్రస్తుతం అబూ హఫ్స్ అల్-హషిమీ అల్-ఖురైషీ (2023 నుండి) కొనసాగుతున్నాడు. అమెరికా, భారత్‌, ఇరాక్‌ తోపాటు పలు దేశాలు ఐసిస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాయి. క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చిన ఐసిస్‌ నెట్‌వర్క్‌.. ప్రస్తుతం ఆఫ్రికా–ఆసియా ప్రాంతాల్లో చిన్నచిన్న గుంపులుగా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement