డాక్టర్‌ చేతిలో కరోనా పేషెంట్ల హత్య!

Doctor Accused Murdering 2 Covid Patients To Free Up Beds In Italy - Sakshi

రోమ్‌: వైద్యో నారాయణ హరి అన్న పదానికే మచ్చ తెచ్చాడో వైద్యుడు. ప్రాణం పోయాల్సిన చేతితో ఇద్దరు కరోనా పేషెంట్ల ఉసురు తీశాడు. ఈ దారుణ ఘటన కరోనా విజృంభించిన తొలినాళ్లలో ఇటలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  డాక్టర్‌ కార్లొ మోస్కా ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డుకు ఇంచార్జిగా పని చేస్తున్నాడు. అక్కడ బెడ్లు ఖాళీగా లేకపోవడంతో సదరు వైద్యుడు కొందరు పేషెంట్లను చంపేయాలని చూశాడు. ఇందుకు ఎక్కువ వయసున్న వారిని ఎంచుకున్నాడు. 61 ఏళ్ల నటాలే బస్సీ, 80 ఏళ్ల ఏంజెలో పలెట్టి అనే ఇద్దరు కోవిడ్‌ పేషెంట్లకు మత్తుమందుతో పాటు కండరాల నొప్పులకు వాడే మందులను ఎక్కువ డోసులో ఇవ్వడంతో వారు ప్రాణాలు విడిచారు. మార్చిలో చోటు చేసుకున్న ఈ ఘటన మీద పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు, నర్సులతో చేసిన చాటింగ్‌ బయటపడింది. (చదవండి: స్ట్రెయిన్‌తో యూరప్‌ బెంబేలు, మరణాలూ ఎక్కువే!)

'కేవలం బెడ్లు ఖాళీ అవడం కోసం నేనీ పని చేయలేను', 'ఇది చాలా మూర్ఖత్వపు చర్య' అంటూ నర్సులు మెసేజ్‌ల ద్వారా అతడిని హెచ్చరించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా అతడే స్వయంగా ఆ పని చేసేందుకు పూనుకున్నాడు. పైగా రోగులకు ఔషధాలిచ్చే సమయంలో నర్సులను బయటకు వెళ్లమని చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో మరణించిన మరో ముగ్గురి చావుకు గల కారణాలను కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా పేషెంట్ల ప్రాణాలు తీశాడన్న ఆరోపణలతో ఎమర్జెన్సీ వార్డ్‌కు హెడ్‌గా ఉన్న అతడిని మోంటిచైరి ఆస్పత్రి విధుల నుంచి తొలగించింది. మరోవైపు పోలీసులు అతడిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. ఇవన్నీ నిరాధారమైనవిగా పేర్కొన్నాడు. ప్రాణాలు కాపాడే వాడినే కానీ తీసేవాడిని కానని చెప్పుకొచ్చాడు. (చదవండి: 'కోవిడ్‌ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకోలేదు')

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top