'కోవిడ్‌ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకోలేదు' | Sakshi
Sakshi News home page

'నిన్ను రథం మీద తీసుకొస్తం’ అంటున్నరు నా పిల్లలు

Published Tue, Jan 26 2021 4:38 AM

Two Nurses Honoured by With the National Florence Nightingale - Sakshi

ఒకరు శుక్రా... మరొకరు అరుణకుమారి. ఇద్దరూ నర్సులుగా జీవితాన్ని మొదలుపెట్టారు. వృత్తినే దైవంగా భావించారు. కుటుంబ సమస్యలేవీ వృత్తిలోకి రానివ్వలేదు. వృత్తిలో ఉండే ఒత్తిడి ఏదీ కుటుంబాన్ని చుట్టుముట్టనివ్వలేదు. నమ్ముకున్న పనికి సంపూర్ణ న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేశారు. దాని ఫలితంగానే  ఈ ఏడాది వైద్య, ఆరోగ్య సేవా రంగంలో జాతీయ స్థాయిలో 56 మందికి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుల జాబితా ప్రకటించగా వారిలో   తెలంగాణా నుంచి ఈ ఇద్దరూ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని సాక్షి పలకరించింది.

► నైటింగేల్‌ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా?
శుక్రా: ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్ప వరం ఇచ్చిండు. వర్ణించడానికి కూడా మాటల్లేవు. 28 ఏళ్లు కష్టం చేసిన. కానీ, ఇప్పుడు ఈ అవార్డు ముందట ఆ కష్టమేమీ కనిపించడం లేదు. మా ఇంట్ల, చుట్టుపక్కల, ఊర్లలో కూడా చాలా సంతోషపడుతున్నరు. సన్మానం చేస్తాం అంటున్నరు. వాళ్ల అభిమానమే నాకు పెద్ద అవార్డు.
అరుణ: సేవలో దేవుని గుర్తింపు ఉంటుందని ఎప్పుడూ నమ్ముతాను. అది ఈ రోజు నిజమైనందుకు సంతోషంగా ఉంది. 22 ఏళ్లుగా ఏఎన్‌ఎమ్‌గా సేవలు అందిస్తున్నా. ఈ అవార్డు ఉందని తెలుసు. కానీ, అంతమందిలో నన్ను వరిస్తుందనుకోలేదు.

► ఈ రంగంలోకి రావాలని ఎలా అనుకున్నారు?
శుక్రా: చిన్నప్పుడు తిండికి కూడా లేక బాధపడిన రోజులు ఉన్నాయి. మా ఊరి బడి 5వ తరగతి వరకే. ఆ తర్వాత మా నాన్న నన్ను బాలసదన్‌ లో వేశాడు. అక్కడే టెంత్‌ వరకు చదువుకున్నా. తర్వాత నర్స్‌ ట్రెయినింగ్‌ చేశాను. మా తాత వాళ్లది రామారం. అక్కడి వాళ్లకు సేవ చేయాలని ఉండేది. ఆ తండాల వాళ్లు అబ్దుల్లా మనవరాలు వచ్చిందని, డాక్టరమ్మ వచ్చిందని అనేవారు. నేను సిస్టర్‌నే కానీ, వాళ్లంతా నాకు డాక్టరమ్మ అని బిరుదు ఇచ్చారు. ఆ పిలుపు నాకెంతో అమూల్యమైనది.  

అరుణ: మా నాన్న జాన్, అమ్మ శోభారాణి నా కష్టానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడైనా సెలవు పెట్టినా నాన్న వెంటనే ‘ఏదైనా అత్యవసరం ఉంటేనే లీవు పెట్టు తల్లీ. అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటుందో ఏమో..’ అని చెప్పేవారు. మా నాన్న ఉండుంటే ఆయనకే ఈ అవార్డును కానుకగా ఇచ్చేదాన్ని. 1998లో హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌లోని యుహెచ్‌పిలో జాయినయ్యాను. 2008 నుంచి విజయనగర్‌ కాలనీలోని యుపిహెచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా చుట్టు ఉన్నవాళ్లకు నాకు చేతనయినంత సాయం చేయాలనుకునేదాన్ని. మా మేనమామలు నర్సింగ్‌ అయితే నీ ఆలోచనకు సూటవుతుందని చెప్పారు. దాంతో టెన్త్‌ తర్వాత ఎఎన్‌ఎమ్‌గా శిక్షణ తీసుకున్నాను.

► కోవిడ్‌–19 సమయంలో ఎదుర్కొన్న కష్టాలు..
శుక్రా: ఏం భయపడలేదు. ఉద్యోగమే దేవుడు. నాకేమైనా అయితే ఆ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. ఊరూరూ తిరిగి కరోనా గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన. ఇంట్లో వాళ్లు కూడా నన్ను దూరం పెట్టలేదు. నాకు కరోనా పాజిటివ్‌ వచ్చినా తట్టుకున్నా. కొన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత డ్యూటీకి వెళ్లిపోయిన.

అరుణ: కోవిడ్‌ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకున్నది లేదు. అర్ధరాత్రుళ్లు కూడా బయల్దేరేవాళ్లం. కరోనా పేషంట్స్‌ అంటే వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా భయపడేవాళ్లు. కానీ, వాళ్లను పట్టుకొని అంబులెన్స్‌ ఎక్కించి, హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి, రోజూ వెళ్లి వారి హెల్త్‌ చెక్‌ చేసి వస్తే ‘మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్లే పక్కకు పోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మాకు చేసిన సేవకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారు. అలా అందరి దీవెనలు నాకు, నా పిల్లలకు వస్తాయనుకుంటాను. కరోనా పేషంట్ల మధ్య ఉండటం వల్ల నాకూ కరోనా వచ్చింది. డాక్టర్ల సలహాతో 15 రోజుల హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. ఆ తర్వాత రోజే డ్యూటీలో జాయిన్‌ అయ్యాను. మొదట్లో హాస్పిటల్‌ నుంచి ఇంటికి వెళితే నన్ను చూసి భయపడేవారు వాళ్లకూ కరోనా వస్తుందేమో అని. మేం ఉండే అపార్ట్‌మెంట్‌లో చాలా మంది 50, 60 వయసు పైబడిన వారే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టారు. దేవుని మీద భారం వేసి ముందుకెళ్లేవాళ్లం. ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకున్నాం. మాతో పాటు ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు కూడా తీసుకున్నారు. ఎవరూ భయపడలేదు. వ్యాక్సిన్‌ తర్వాత కూడా అందరం ఆన్‌డ్యూటీలోనే ఉన్నాం. చేసే పని ఏదైనా అంకితభావంగా చేసుకుంటూ పోతే విజయం తప్పక వరిస్తుందన్నది నా నమ్మకం.

► ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు..
శుక్రా: తండాల్లో ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయించడంలో అవార్డు వచ్చింది. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి చేతుల మీదుగా అందుకున్నాను. డిఎన్‌హెచ్‌ లో ఆరు అవార్డులు వచ్చాయి. వ్యాధుల గురించి అవగాహన కలిగించే పాటలు  రాస్తాను. సీడీ ఆవిష్కరణ కూడా చేశాం. గిరిజన డ్యాన్సుల్లో పాల్గొన్నాను. అందుకు నేషనల్‌ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటిదాకా పదిహేనుకు పైగా అవార్డులు వచ్చాయి. కానీ, ఇన్నేళ్లయినా ప్రమోషన్లు లేవు. ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కలవాలన్నది నా ఆశ.

అరుణ: ఇప్పటివరకు బెస్ట్‌ ఏఎన్‌ఎమ్‌గా ఆరు అవార్డులు తీసుకున్నాను. కోవిడ్‌ డ్యూటీ చేసినందుకు కేటీఆర్‌ సార్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడీ నైటింగేల్‌ అవార్డు. ఉద్యోగం ఎప్పుడూ నాకు బెస్ట్‌ ఇస్తూనే ఉంది.

► కుటుంబ జీవనంలో కష్టాలు విధి నిర్వహణకు అడ్డు పడిన సందర్భాలేమైనా ఉన్నాయా?
శుక్రా: కుటుంబం గడవడానికి బాగా కష్టపడ్డా. టెన్త్‌ అయిపోగానే పెళ్లి చేశారు. మా ఆయనకు ఉద్యోగం లేదు. కొద్దిరోజులు కూలికి కూడా పోయిన. అప్పుడు ఆయన కొన్ని రోజులు డెయిలీ వేజ్‌ చేసేవారు. పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకున్నా వెంట తీసుకొని ఉద్యోగానికి పోయాను కానీ, విధి నిర్వహణకు అడ్డుపడనీయలేదు. అందుకే, ఇప్పుడు అవార్డు తీసుకొని ఊళ్లకు వచ్చిన రోజున ‘నిన్ను రథం మీద తీసుకొస్తం’ అంటున్నరు నా పిల్లలు.

అరుణ: ట్రెయినింగ్‌ అవుతూనే పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరు అమ్మాయిలు. గుండెపోటు వల్ల 2006లో మా ఆయన చనిపోయారు. గుండె చిక్కబట్టుకొని పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేశాను. పెద్దమ్మాయి బీకామ్‌ కంప్యూటర్స్, చిన్నమ్మాయి బీఎస్సీ నర్సింగ్‌ అయింది. ఎంత కష్టమొచ్చినా ఉద్యోగం ఉద్యోగమే. మా అమ్మానాన్న, తమ్ముళ్లు, మేనమామలు.. నా ఫ్యామిలీ సపోర్ట్‌ వల్ల నిలదొక్కుకున్నాను.

హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలోని యుపిహెచ్‌లో నర్సింగ్‌ విధులను నిర్వర్తిస్తున్నారు అరుణ.
వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌ సబ్‌ సెంటర్లో ఏఎన్‌ఎంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్రా.

– నిర్మలారెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement