ఏపీలో కరోనా కట్టడి భేష్‌

Corona Prevention measures is too good in Andhra Pradesh - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరు బాగుంది 

సెకండ్‌ వేవ్‌పై ఫలించిన త్రిముఖ వ్యూహం 

దేశవ్యాప్తంగా కోవిడ్‌ నిర్వహణలో 2వ ర్యాంకు 

సామాజిక మాధ్యమ సర్వేలో 54% మద్దతు  

సాక్షి, అమరావతి: టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ ద్వారా కరోనా కట్టడి వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసిన ఏపీకి ప్రజాభిప్రాయ సేకరణలో మద్దతు లభించింది. కోవిడ్‌ నియంత్రణలో  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయని, బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించడంలో ముందు వరుసలో ఉన్నట్లు 54% మంది ప్రజలు తెలిపారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నియంత్రణపై సామాజిక మాధ్యమ సంస్థ ‘లోకల్‌ సర్కిల్స్‌’ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో 59% ప్రజల మద్దతుతో తమిళనాడు మొదటి స్థానం సాధించగా 54% ప్రజల మన్ననలు పొంది ఏపీ రెండో స్థానంలో నిలిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించి సర్వే నివేదిక విడుదల చేశారు.   

మెరుపు వేగంతో.. 
సెకండ్‌ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని, చర్యలు తీసుకోవడం, బాధితులకు వైద్యం అందించడం, ఆస్పత్రుల నిర్వహణ, పడకలు సమకూర్చడం, వైద్య సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన విషయాల్లో సకాలంలో చర్యలు తీసుకున్నట్లు సర్వేలో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సర్వేలో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. 25 శాతం మంది ఆ రాష్ట్రంలో బాగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.  

ఏపీలో ఏర్పాట్లపై సర్వేలో ముఖ్యాంశాలివీ.. 
► 2021 జూన్‌లో ఒకే రోజు 24 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చినా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయగలిగారు. 
► ఆస్పత్రుల సంఖ్య పెంచడంతో పాటు అందుకు అనుగుణంగా పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యాలు సమకూర్చారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు.. వెంటిలేటర్‌ బెడ్స్, కోవిడ్‌ మేనేజ్‌మెంట్, మెడిసిన్స్‌ ఏర్పాటు చేశారు. 
► మే నెలలో కోవిడ్‌ కేసుల తీవ్రత దృష్ట్యా ట్రేసింగ్‌ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. 
► గ్రామ, వార్డు సచివాలయాల పరిధి మొదలుకొని పట్టణాల వరకూ క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చాలా బాగా పనిచేశారు. 
► ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా కోవిడ్‌ నియంత్రణపై విస్తృత ప్రచారం కల్పించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top