డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ –2020

Deforestation Is Causing Virus Attacks On Human - Sakshi

హరివిల్లులో ఏడు రంగుల స్థానంలో ఒక రంగు మాత్రమే ఉంటే?  భూమ్మీద తెల్లటి పూలు మాత్రమే పూస్తే? పండ్లు అన్నింటి రుచి ఒకేలా ఉంటే? అబ్బే... ఏం బాగుంటుంది అంటున్నారా?  నిజమే. అన్నీ ఒకేలా ఉంటే బోర్‌ కొట్టేస్తుంది!  వైవిధ్యం అనేది మనసుకు ఆనందం కలిగిస్తుంది! ప్రయోజనాలూ బోలెడు! కానీ.. ఈ విషయం మనిషికి పూర్తిగా అర్థమైనట్లు లేదు.  ఎందుకంటే.. మన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని తెలిసినా... వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్‌ తదితరాల పేరుతో.... అడవులు, నదులు, సరస్సులు, నేలలను నాశనం చేస్తూనే ఉన్నాడు! వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) సిద్ధం చేసిన లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ –2020 చెబుతున్నది ఇదే! 

కోవిడ్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోట్ల కేసులు.. లక్షల్లో మరణాలు... ఆర్థిక వ్యవస్థ ఛిద్రం.. ఉద్యోగాల కోత. ఇలా ఎన్నెన్నో సమస్యలకు ఒక వైరస్‌ కారణమైందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ.. కోట్ల సంవత్సరాలపాటు జంతువుల్లో నిక్షేపంగా బతికిన ఈ వైరస్‌లు ఈ మధ్య కాలంలో మనిషికి ఎందుకు సంక్రమిస్తున్నాయో.. కారణమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? హెచ్‌1ఎన్‌1 కానివ్వండి, చికెన్‌ గున్యా కానివ్వండి. స్వైన్‌ఫ్లూ కానివ్వండి అన్నీ జంతువుల నుంచి మనిషికి సోకిన వ్యాధులే. ఇప్పుడు కోవిడ్‌–19 కూడా. మనిషి ఎప్పుడైతే అటవీ సంపదను తన స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ సమస్య కూడా పెరగడం మొదలైందని అంటారు నిపుణులు.

ప్రకృతిని, జీవజాలాన్ని పరిరక్షించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోకపోతే కోవిడ్‌ –19 తరహా విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ తన లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ –2020లో స్పష్టం చేసింది. రెండేళ్లకు ఒకసారి విడుదల చేసే లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ను ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి సిద్ధం చేశారు. 1970 నుంచి 2016 మధ్యకాలంలో  ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 వేల క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరిసృపాలు సంతతిని పరిశీలిస్తూ సిద్ధం చేసిన ఈ నివేదిక దాదాపు 164 పేజీల నిడివి ఉంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top