కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు  | Colombian Presidential Candidate Miguel Uribe shot in Head During Rally | Sakshi
Sakshi News home page

కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు 

Jun 8 2025 8:09 AM | Updated on Jun 9 2025 5:29 AM

Colombian Presidential Candidate Miguel Uribe shot in Head During Rally

బొగోటా(కొలంబియా): కొలంబియాలో 2026 అధ్యక్ష ఎన్నికల్లో విపక్ష డెమొక్రటిక్‌ సెంటర్‌ పార్టీ అభ్యర్థి అయిన సెనేటర్‌ మిగ్వెల్‌ ఉరిబే టర్బే (39)పై కాల్పులు జరిగాయి. శనివారం సాయంత్రం రాజధాని బొగోటాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వెనుక నుంచి ఒక టీనేజర్‌ తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. రెండు తూటాలు తలలోకి, ఒకటి ఛాతిలోకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. దాంతో మిగ్వెల్‌ ఒక్కసారిగా కుప్పకూలారు. కాల్పుల వీడియో వైరల్‌గా మారింది. సమీప ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను హెలికాప్టర్‌లో శాంటా ఫే ఫౌండేషన్‌ ఆస్పత్రికి తరలించారు.

 మెదడు, వెన్నుపూస, నరాల సంబంధ శస్త్రచికిత్సలు చేశారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మిగ్వెల్‌ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని భార్య మారియా క్లాడియా టరజోనా వాపోయారు. దుండగున్ని ఘటనాస్థలిలోనే అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణం తెలియాల్సి ఉంది. మిగ్వెల్‌కు ఎలాంటి రాజకీయ శత్రువులు లేరని తెలుస్తోంది. కొలంబియాలో 1980, 1990 దశకాల్లోనూ అధ్యక్ష అభ్యర్థులపై డ్రగ్స్‌ ముఠాలు దాడులు చేశాయి. వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం ఐదుగురు అధ్యక్ష అభ్యర్థులను పొట్టన పెట్టుకున్నారు.


 

ఎవరీ మిగ్వెల్‌? 
విపక్ష డెమొక్రటిక్‌ సెంటర్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మిగ్వెల్‌ పేరు ఇప్పుడు కొలంబియా అంతటా మార్మోగుతోంది. మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబే స్థాపించిన ఆ పార్టీలో మిగ్వెల్‌ మూడేళ్లుగా సెనేటర్‌గా ఉన్నారు. ఆయన తాత జూలియో సీజర్‌ టుర్బే అయాలా 1978–82 మధ్య దేశాధ్యక్షునిగా చేశారు. తల్లి డయానా పాత్రికేయురాలు. 1990లో కిరాతక పాబ్లో ఎస్కోబార్‌ డ్రగ్స్‌ ముఠా ఆమెను కిడ్నాప్‌ చేసింది. వాటికి, కొలంబియా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఆమె ప్రాణాలుకోల్పోయారు. తాత రాజకీయ వారసునిగా మిగ్వెల్‌ ఎదిగారు. బొగోటా సిటీ కౌన్సిల్‌ సభ్యునిగా, సిటీ గవర్నమెంట్‌ సెక్రటరీగా సేవలందించారు. 2019లో బొగోటా మేయర్‌గా పోటీచేసి ఓడిపోయారు.

ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్‌ అధికారితో లింకు ?
 

Advertisement
 
Advertisement
Advertisement