చైనా షాకింగ్‌ నిర్ణయం..పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..

China Weighs Giving Single Women IVF Access To Stem Population Decline - Sakshi

ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనాలో వేగవంతంగా జనాభా క్షీణించడంతో దాన్ని నియంత్రించేలా పలు చర్యలు ఇప్పటికే తీసుకుంది చైనా. ఇప్పుడు ఇంకాస్త ముందడుగు వేసి.. యావత్‌ ప్రపంచం విస్తుపోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితలు, ఒంటరి మహిళలు ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలను కనే వెసులుబాటుని ఇస్తోంది. పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీలను అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చునని చెబుతోంది. అవివాహిత స్త్రీల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది.

వారు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చు అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఈ మేరకు చైనాలోని అవివాహిత స్త్రీలు ప్రైవేట్‌ లేదా పబ్లిక్‌ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్‌ చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే నైరుతి సిచువాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ దీన్ని ఆశ్రయించే తల్లి కాబోతోంది. ప్రస్తుత ఆమె 10 వారాల గర్భవతి. చాలా మంది ఒంటరి మహిళలు దీన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్‌ని సరళీకృతం చేస్తే గనుక ఇదొక పెద్ద మార్కెట్‌గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణలు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఐవీఎఫ్‌ చికిత్సకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రల్లో మహిళలందరికీ ఐవీఎఫ్‌ చికిత్స అందిస్తారనేది స్పష్టత లేదు.

ఇప్పటివరకు ఎంత మంది మహిళలు దీన్ని ఉపయోగించుకున్నారనేది కూడా స్పష్టం కాలేదు. కానీ చాలా మంది మహిళలు ఐవీఎఫ్‌ సెంటర్లకు క్యూ కడుతున్నట్లు సమాచారం. జాతీయ ఆరోగ్య కేంద్రం మరిన్ని ఐవీఎఫ్‌ సెంటర్‌లను అందుబాటులో తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇంతకు మునుపు చైనా పెళ్లికాని మహిళలకు ఐవీఎఫ్‌ సేవలను నిషేధించింది. ఎప్పుడైతే జనాభా క్షీణించడం ప్రారంభించిందో అప్పటినుంచి చైనా పిల్లలను కనేలా ప్రజలకు బారీ ఆఫర్‌లు అందిస్తూ ప్రోత్సహించింది. ఈ క్రమంలో పలు నిబంధనలు ఎత్తి వేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ ఐవీఎఫ్‌ చికిత్సా విధానం తెరమీదకు వచ్చింది. 

(చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్‌ జ్యూస్‌ వివాదం..యువతి అరెస్టు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top