చైనా అక్రమ వంతెన: గట్టిగా వ్యతిరేకిస్తున్న భారత్‌

China Nears Completion of key Bridge Across Pangong - Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో పట్టు కోసం పాంగాంగ్‌ సరస్సు మీదుగా అక్రమంగా ఒక వంతెనను నిర్మిస్తున్న డ్రాగన్‌ దేశం గజగజలాడించే చలిలో కూడా పనులు కొనసాగిస్తోంది. 8 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణం 400 మీటర్ల వరకు పూర్తయినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. 2020 సంవత్సరం నుంచి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకి దారి తీసిన పాంగాంగ్‌ సరస్సుకి ఉత్తర తీరంలో ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ఇది పూర్తయితే ఆ ప్రాంతంలో చైనా మిలటరీ పరంగా పట్టు సాధించడానికి వీలవుతుంది.

చదవండి: (ఆడమ్‌ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్‌ రికార్డు!)

జనవరి 16న తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో చైనాకు చెందిన నిర్మాణ కార్మికులు భారీ క్రేన్లు, యంత్రాల సాయంతో పిల్లర్లను కలిపేలా సిమెంట్‌ స్లాబులను అమర్చే దృశ్యాలు రికార్డు అయ్యాయి. భారీగా మంచుకురుస్తున్న ప్రతికూల వాతావరణంలో కూడా చైనా కార్మికులు వంతెన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఈ వంతెన పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ వంతెన పూర్తయితే పాంగాంగ్‌ సరస్సు నుంచి రూటగ్‌లో సైనిక శిబిరానికి వెళ్లే దూరం ఏకంగా 150 కి.మీ. తగ్గిపోతుంది. 1958 సంవత్సరం నుంచే ఈ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా తమ చేతుల్లో  తీసుకున్న చైనా ఇప్పుడు వంతెన నిర్మాణ పనుల్ని వాయువేగంతో పూర్తి చేస్తోంది. అయితే చట్టవిరుద్ధంగా సాగిస్తున్న ఈ నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ  చెబుతోంది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top