రూ. 1000 కోట్ల హవాలా సొమ్ము: చైనా స్పందన

China Foreign Ministry On IT Raids On Chinese Companies In India - Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్‌తో పాటు హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్న చైనా దేశీయుడు లూ సాంగ్‌ను ఆదాయ పన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై డ్రాగన్‌ స్పందించింది. విదేశాల్లో వ్యాపారం నిర్వహించే చైనీయులు స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. అయితే అదే సమయంలో చైనా కంపెనీల సాధారణ కార్యకలాపాల విషయంలో భారత్‌ పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్షకు తావు లేని మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాగా చైనా కంపెనీల హవాలా దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఐటీ శాఖ మంగళవారం ఢిల్లీ, ఘజియాబాద్‌, గురుగ్రాం సహా మరో 21 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.

ఈ క్రమంలో వెయ్యి కోట్ల రూపాయాల మేర హవాలా సొమ్ము చేతులు మారినట్లు గుర్తించారు. చైనాకు చెందిన ఓ కంపెనీ, దాని అనుబంధ సంస్థలు భారత్‌లో రీటైల్‌ షోరూంల బిజినెస్‌ పేరిట షెల్‌ కంపెనీలు సృష్టించి వందలాది కోట్లు వసూలు చేసినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ) తెలిపింది. ఈ డబ్బును హాంకాంగ్‌, అమెరికా కరెన్సీలోకి మార్చేందుకు లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మనీల్యాండరింగ్‌కు ప్రధాన సూత్రధారి అయిన లూ సాంగ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారించనుంది.(హవాలా లావాదేవీల్లో ఆరితేరిన లూ సాంగ్‌)

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ ఓ భారత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ కంపెనీలు మనీల్యాండరింగ్‌ చేశాయా అన్న విషయం గురించి పూర్తిగా తెలియదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలు అంతర్జాతీయ, స్థానిక చట్టాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనా ప్రభుత్వం స్పష్టం గా చెబుతోంది. అయితే అదే సమయంలో మాకు మా పౌరులు, వారి కంపెనీల రక్షణ కూడా ముఖ్యమే. చైనా కంపెనీల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా న్యాయపరమైన, వివక్ష రహిత వాతావరణాన్ని భారత్‌ కల్పిస్తుందని చైనా ఆశిస్తోంది’’అని పేర్కొన్నారు. కాగా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులపై కఠిన నిబంధనలు విధించడం సహా పలు చైనా యాప్‌లను భారత్‌ నిషేధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

భారత యువతిని పెళ్లాడి..
హవాలా రాకెట్‌కు సూత్రధారి అయిన లూ సాంగ్‌.. భారత పాస్‌పోర్ట్‌ను సులభంగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో నిందితుడు గతంలో మణిపురి యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. చార్లీ పెంగ్‌కు భారత్‌లో హవాలా లావాదేవీలు, మనీల్యాండరింగ్‌కు పాల్పడే క్రిమినల్‌ గ్యాంగులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  40కి పైగా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్న లూ సాంగ్‌.. దేశంలో గుట్టుచప్పుడుగా మనీ ఎక్స్ఛేంజ్‌ సేవలను అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా గూఢచర్య ఆరోపణలపై 2018లో లూ సాంగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు కూడా వెల్లడైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top