Russia-Ukraine War:ఉక్రెయిన్‌లో రష్యా సేనలను నిలువరిస్తూ ప్రాణాలు కోల్పోయిన బ్రెజిల్ మోడల్‌

Brazil Model Killed in Russian Forces Missile Attack - Sakshi

కీవ్‌: రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్‌.. థాలిట డో వల్లె (39) ప్రాణాలు కోల్పోయింది. భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో ఉన్న ఆమె.. ఆ దేశం తరఫున స్నైపర్‍గా బరిలోకి దిగి రష్యా సేనలకు అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఖార్కివ్ నగరంపై రష్యా సైన్యం జూన్ 30న క్షిపణులతో విరుచుకుపడింది.

మొదటి క్షిపణి దాడి జరిగినప్పుడు తన ట్రూప్‌లో థాలిట మాత్రమే ప్రాణాలతో మిగిలింది. కాని ఆ తర్వాత మరో క్షిపణి పడటంతో ఆమె మృతి చెందింది. బంకర్‌లో ఉన్న థాలిట కోసం వెళ్లిన బ్రెజిల్ మాజీ సైనికుడు డాగ్లస్‌ బురిగో (40) కూడా క్షిపణి దాడిలోనే మరణించాడు.

థాలిటకు గతంలో యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉంది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా ఆమె పోరాడింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని తన యూట్యూబ్‌ ఛానల్లో పోస్టు చేసింది. ఇరాక్‌లో పెష్‌మెర్గాస్‌ సాయుధ బలగాల తరఫున పోరాడే సమయంలోనే స్నైపర్ శిక్షణ తీసుకుంది. ఆమె అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చేందుకు ఓ రచయిత బ్రెజిల్‌ సైనికుడితో కలిసి పనిచేస్తున్నాడు.

నటిగా..
థాలటి యుక్త వయసులో నటిగా, మోడల్‌గా పని చేసింది. లా చదివే సమయంలో ఆమె ఎన్‌జీఓలతో కలిసి జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సోదరుడు రొడ్రిగో వైరా.. ఆమె ఓ హీరో అని చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు, మనవతా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఉక్రెయిన్‌కు వెళ్లి మూడు వారాలే అవుతోందని చెప్పాడు. అక్కడ సహాయక కార్యక్రమాల్లోనే పాల్గొంటూనే షార్ప్ షూటర్‌గా సేవలందిస్తోందని తెలిపాడు.

అదే చివరిసారి
ఉక్రెయిన్ ‍రాజధాని కీవ్‍పై రష్యా బలగాలు బాంబు దాడులు జరిపినప్పుడు థాలిట తృటిలో ప్రాణాలతో బయపడింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పింది. రష్యా బలగాలు డ్రోన్ల ద్వారా తన ఫోన్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నందుకు ఎక్కువ మాట్లాడలేనని కుటుంబసభ్యులు వివరించింది. ఆ తర్వాత ఆమె గత సోమవారమే ఖార్కివ్‌కు వెళ్లింది. అప్పుడే చివరిసారిగా కుటుంబంతో మాట్లాడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top