
బాసాంకుసు, కాంగో: ఉత్తర పశ్చిమ కాంగోలోని ఎక్వాటర్ ప్రావిన్స్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులేనని గుర్తించారు. ఈ విషాదకర ఘటన బుధవారం (సెప్టెంబర్ 10) బాసాంకుసు అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.
ప్రభుత్వ మీడియా ప్రకారం..ఈ విషాదానికి ప్రధాన కారణం ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం,రాత్రి పడవ ప్రయాణానికి ప్రతీకూల వాతావరణం వల్లేనని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో ఎక్కువ మంది విద్యార్థులు, స్థానిక ప్రయాణికులు అని సమాచారం.
బాసాంకుసు ప్రాంతం కాంగోలోని దట్టమైన అడవులతో కూడిన ప్రాంతం. ఇక్కడ రవాణా ప్రధానంగా నదుల ద్వారా జరుగుతుంది. అయితే, సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అధిక లోడింగ్, అనుభవ రాహిత్యం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం కొనసాగుతున్నట్లు ప్రభుత్వ మీడియా కథనాలు తెలిపాయి.