పారిస్: బలోచ్ నేషనల్ మూవ్‌మెంట్ (బీఎన్‌ఎమ్) సీనియర్ నేత డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ అదృశ్యమై 17 ఏళ్లు అవుతోంది. బలోచ్ స్వేచ్ఛ కోసం గొంతెత్తిన వారిని అదృశ్యం చేసి, వారి ఆచూకీని తెలియకుండా చేసే పాకిస్థాన్ చర్యలకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. తన తండ్రి ఆచూకీ తెలుసుకోవాలని, అదృశ్యమైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ 17 ఏళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నా, ఆమెకూ బెదిరింపులు ఎదురవుతున్నాయని బలోచ్ నేషనల్ మూవ్‌మెంట్ ఆరోపిస్తోంది.
ముహమ్మద్ బలోచ్ అదృశ్యానికి 17 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీఎన్‌ఎమ్ అధ్యక్షుడు డాక్టర్ నసీమ్ బలోచ్ స్పందించారు. బలోచిస్థాన్‌లో అదృశ్యమైన వారు పడుతున్న బాధలకు ఈ ఘటన ఇప్పటికీ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.
ఎక్స్‌లో డాక్టర్ నసీమ్ బలోచ్ దీనిపై మాట్లాడుతూ.. "ఇన్నేళ్లుగా ఓ వ్యక్తి అదృశ్యమైతే ఏ కుటుంబమైనా భరించలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆయన కుటుంబ సభ్యులు అనిశ్చితి, వేదన మధ్య జీవిస్తున్నారు. ఆయనకు ఏమైందో తెలుసుకునే కనీస హక్కు కూడా వారికి దక్కలేదు" అని అన్నారు.
డాక్టర్ దీన్ ముహమ్మద్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్‌ను నసీమ్ బలోచ్ ప్రస్తావిస్తూ.. "తన తండ్రితో పాటు.. అదృశ్యమైన వారిని తిరిగి తీసుకురావాలన్న శాంతియుత పోరాటానికి ఆమె ధైర్యంగా అంకితమైంది. న్యాయం దక్కాల్సిన చోట కూడా ఆమె బెదిరింపులను ఎదుర్కొంటోంది. ఆమె మానవ హక్కుల పోరాటాన్ని, తన తండ్రి తిరిగి రావాలన్న ఉద్యమాన్ని విడిచిపెట్టేలా బెదిరింపులు, భయపెట్టే చర్యలు ఎదుర్కొంటోంది" అని ఆరోపించారు.
ఈ ఘటన పాకిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిదర్శనమని ఆరోపించారు. ఇది కఠిన వాస్తవాన్ని బయటపెడుతోందని, పాకిస్థాన్‌లో ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారికి మానవ హక్కులు, న్యాయం లేకుండా చేస్తున్నారని తెలిపారు. అదృశ్యమైన కుటుంబ సభ్యుడి గురించి సమాచారం అడగడాన్నే నేరంగా చూస్తున్నారని, మానవ హక్కుల పరిరక్షకులను గొంతెత్తినందుకు బెదిరిస్తున్నారని చెప్పారు.
పాకిస్థాన్ పాలనలో తమ బలోచ్ ప్రజలు మౌలిక హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను సాధించలేరని బీఎన్‌ఎమ్ నమ్ముతోందని అన్నారు. "చివరకు సత్యం, న్యాయమే గెలుస్తాయని మేము నమ్ముతున్నాం. మా లక్ష్యాలు నెరవేరే వరకు మా శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తాం" అని తెలిపారు.
పోరాటంలో వెనక్కితగ్గని కుమార్తె

డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ బలోచిస్థాన్‌లో అదృశ్యాలపై గళమెత్తుతున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త. ఆమె తండ్రి 2009లో అదృశ్యమైనప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం నిరంతరం పోరాడుతోంది.
ఆమె బలోచ్ యక్జెహ్తీ కమిటీలో కీలక నాయకురాలిగా, వాయిస్ ఫర్ బలోచ్ మిస్సింగ్ పర్సన్స్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2014లో క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వరకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, తన తండ్రితో పాటు అదృశ్యమైన బలోచ్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
బలోచిస్థాన్‌లో బలవంతపు అదృశ్యాలు, న్యాయ విచారణ లేకుండా జరిగే హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై కూడా ఆమె స్వరం వినిపిస్తోంది. మానవ హక్కుల పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు 2024లో ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అవార్డు లభించింది.
ఆందోళన కార్యక్రమాల సందర్భంగా ఆమెను పలుసార్లు పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు, విదేశీ ప్రయాణాన్ని కూడా అడ్డుకున్నట్లు మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. తండ్రి ఆచూకీ కోసం మొదలైన ఆమె పోరాటం, ఇప్పుడు బలోచిస్థాన్‌లో అదృశ్యమైన వేలాది మంది కుటుంబాల తరఫున న్యాయం కోరే ఉద్యమంగా మారింది.


