
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు త్వరలో ఫుల్‌స్టాప్ పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సంయుక్త భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారత్-చైనాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరో ముందడుగు పడింది. ఇరు దేశాలు సరిహద్దు సమస్య పరిష్కారం కోసం కలసి పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు డీలిమిటేషన్‌కు పరిష్కారాన్ని అన్వేషించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సమావేశం అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
ఇరుదేశాలు వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను పునఃప్రారంభించాలని, కైలాస పర్వత యాత్ర, మానసరోవర్ యాత్రకు మరింత ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించాయని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే లిపులేఖ్ పాస్, షిప్కి లా , నాథు లా వాణిజ్య కేంద్రాల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల ద్వారా త్వరలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో శాంతి కొనసాగేందుకు అడుగుపడనున్నదనే అభిప్రాయాన్ని ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకునేందుకు ఈ చర్చలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
భారత్-చైనాల సరిహద్దు సమస్య పరిష్కారం కోసం న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. భారత-చైనా సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు డీలిమిటేషన్‌ను అన్వేషించేందుకు, సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం వర్కింగ్ మెకానిజం (డబ్ల్యూఎంసీసీ) కింద నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు అంగీకరించారని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తెలిపింది. కాగా టియాంజిన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడాన్ని చైనా స్వాగతించింది.