కోవిడ్‌ సక్సెస్‌ స్టోరీ.. ఒకే ఒక్క మరణం

Bhutan: Coronavirus Success Story, How Bhutan Beat Pandemic - Sakshi

అగ్రరాజ్యం సహా అభివృద్ధి  చెందిన దేశాలకు పాఠం

చిన్నదేశమైనా, తగిన వనరులు లేకపోయినా కరోనా నియంత్రణలో విజయం 

సాక్షి, హైదరాబాద్‌: గతనెల 7న భూటాన్‌ రాజధాని థింపూలోని ఒక ఆసుపత్రిలో 34 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందాడు. అతడు అప్పటికే కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆ వ్యాధి నుంచి బయటపడ లేకపోయాడు. అయితే ఏడాదికి పైగా యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా భూటాన్‌లో నమోదైన ఒకే ఒక్క కరోనా మరణం అదే. సోమవారం నాటికి ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 866 మాత్రమే. అగ్రరాజ్యం అమెరికా సహా సైన్స్‌లో ముందంజలో ఉంటూ, అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలతో సుసంపన్న దేశాలుగా ఉన్న ఐరోపా, ఇతర పశ్చిమదేశాల్లో నేటికీ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఏడాది క్రితం బయటపడ్డ ఈ ప్రాణాంతక వైరస్‌ ధనిక, పేద దేశాలు అనే తేడా లేకుండా ఆయా దేశాల్లోని వైద్య, ఆరోగ్య వ్యవస్థలను పూర్తిగా తల్లకిందులు చేసింది. ఆర్థిక వ్యవస్థలు సైతం కుదేలయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిన్న దేశం, అంతగా ఆర్థిక.ఇతర వనరులు, మౌలికసదుపాయాలు లేని భూటాన్‌ కోవిడ్‌ను పూర్తిగా నియంత్రించడమే కాకుండా... ఇప్పటికీ ఒకే ఒక మరణం వంటి అద్భుతమైన రికార్డ్‌ను ఎలా సాధించగలిగింది? 

మొత్తం 337 డాక్టర్లు మాత్రమే... 
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలై ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న సందర్భంలో భూటాన్‌ పని అయిపోయినట్టేనని కొందరు భావించారు. మొత్తం 7,60,00 జనాభాకు వారి వద్ద ఉన్నది 337 మంది డాక్టర్లు మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్‌ ఉండాలి. భూటాన్‌లో డాక్టర్ల నిష్పత్తి డబ్ల్యూహెచ్‌వో సూచించిన దాంట్లో సగం మాత్రమే. వీరిలో ఒక్కరు మాత్రమే అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌లో శిక్షణ పొందారు. కేవలం 3 వేల మంది మాత్రమే హెల్త్‌కేర్‌ వర్కర్లున్నారు. కరోనా శ్యాంపిల్స్‌ పరీక్ష చేసేందుకు ఒకే ఒక పీసీఆర్‌ మిషన్‌ అందుబాటులో ఉంది. ఐరాస లెక్కల ప్రకారం... అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం. తక్కువస్ధాయిలో తలసరి జీడీపీ ఉన్న దేశం. అయినా ఈ మహమ్మారిని సమర్థంగా ఎలా ఎదుర్కొంది? 

అత్యంత వేగంగా కార్యాచరణ అమలు... 
మొదటి కరోనా హెచ్చరికలు అందగానే వెంటనే, వేగంగా ఈ దేశం స్పందించింది.కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేసింది. 2019 డిసెంబర్‌ 31న చైనా అంతు తెలియని న్యూమోనియా వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. ఆ వెంటనే జనవరి 11న భూటాన్‌ జాతీయ సన్నద్ధ ప్రణాళికను సిద్ధం చేసి, జనవరి 15 నుంచే శ్వాసకోశ సంబంధిత లక్షణాలున్న వారి స్క్రీనింగ్‌ మొదలుపెట్టింది. తమ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల నుంచి దేశంలోకి వచ్చే ఎంట్రీ పాయింట్లలో ‘ఇన్‌ఫ్రారెడ్‌ ఫీవర్‌ స్క్రీనింగ్‌’చేపట్టింది. మార్చి 6న కోవిడ్‌–19 మొదటికేసు వచ్చినట్టు ప్రకటించింది. అది కూడా 76 ఏళ్ల అమెరికన్‌ టూరిస్ట్‌. మరో 6 గంటల 18 నిముషాల్లోనే అతడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంటాక్ట్‌లో వచ్చేందుకు అవకాశమున్న 300 మందిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపించేసింది. కరోనా బారిన పడిన వ్యక్తిని విమానంలో అమెరికాకు పంపించింది. చావు తప్పదని భావించిన ఆ వ్యక్తిని కూడా భూటాన్‌లో తొలుత తీసుకున్న చర్యలే రక్షించాయంటూ అమెరికన్‌ డాక్టర్లు పేర్కొనడం విశేషం. 

నిబంధనలు కచ్చితంగా పాటించారు... 
మార్చి నుంచి భూటాన్‌ ప్రభుత్వం ప్రతీరోజు కరోనా సంబంధిత అప్‌డేట్స్‌ను ప్రకటించడంతో పాటు హెల్ప్‌లైన్లను ఏర్పాటుచేసింది. ఇతర దేశాల పర్యాటకులపై నిషేధం విధించింది. స్కూళ్లు, ప్రభుత్వసంస్థలు, జిమ్‌లు, సినిమా థియేటర్లను మూసేసింది. మాస్క్‌లు, చేతుల పరిశుభ్రత, వ్యక్తుల మధ్య దూరం వంటి వాటిని కఠినంగా, నిరంతరంగా అమలు చేసింది. కోవిడ్‌ను మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన ఆరు రోజులకు అంటే మార్చి 16న వైరస్‌ సోకే అవకాశముందని భావించిన వారందరినీ తప్పనిసరి క్వారంటైన్‌కు పంపించింది. వీరిలో వేలాది మంది వివిధ దేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న భూటాన్‌ పౌరులున్నారు. టూరిస్ట్‌ హోటళ్లలో క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ ఉచిత వసతి, ఆహారం అందించింది. పాజిటివ్‌ కేసులుగా తేలిన వారందరినీ విడిగా ఐసోలేట్‌ చేసింది. వారందరికీ కూడా వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు ‘సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌’ఇప్పించే ఏర్పాటు చేసింది. మార్చి చివరకల్లా ఆ దేశ వైద్యశాఖ అధికారులు తప్పనిసరి క్వారంటైన్‌ కాలాన్ని కూడా 14 రోజుల నుంచి 21 రోజులకు (డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన దాని కంటే వారం ఎక్కువ) పెంచారు.

ఈ విధంగా లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా క్వారంటైన్‌లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు పరీక్షించి తగిన వైద్యాన్ని అందజేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దాని వ్యాప్తి నియంత్రణ చర్యలపై పెద్దగా దృష్టి పెట్టని కాలంలోనే భూటాన్‌ భారీస్థాయిలో టెస్టింగ్, ట్రేసింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టడంతో, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం ఒక మొబైల్‌ యాప్‌ను సైతం తయారు చేసింది. గత ఆగస్టు నెలలో క్వారంటైన్‌ వెలుపల తొలి కోవిడ్‌–19 కేసును గుర్తించారు. దీంతో మూడువారాల లాక్‌డౌన్‌ అమలుచేశారు. టెస్టింగ్, ట్రేసింగ్‌ మరింత ఉధృతం చేయడంతో పాటు దేశంలోని ప్రతీ ఒక్క కుటుంబానికి ఆహారం, నిత్యావసరాలు, మెడిసిన్‌ అందజేశారు. గత డిసెంబర్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించి తొలి కేసును గుర్తించారు. దీంతో మరోసారి మరింత కఠినమైన లాక్‌డౌన్‌ విధించారు. మళ్లీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలతో వైరస్‌ బారిన పడకుండా ప్రజలను మేల్కొలిపారు. 

ఆపన్నులను ఆదుకున్నారు... 
గత ఏప్రిల్‌లో భూటాన్‌ రాజు జింగ్మే ఖేసర్‌ నామ్‌జ్యేల్‌ వాంగ్‌చుక్‌ ఓ సహాయనిధిని ప్రారంభించి దాని ద్వారా జీవనోపాధిని కోల్పోయిన 35 వేల మందికి 19 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సహాయాన్ని అందజేశారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, అసహాయులుగా ఉన్న వారు కలిపి మొత్తం 51 వేల మందికి శానిటైజర్లు, విటమిన్లున్న మందులు, ఆహార వస్తువులు, ఇతర కేర్‌ ప్యాకేజ్‌లు అందజేశారు.  

నిబద్ధత, అవగాహన.. ప్రజల భాగస్వామ్యం 
దేశ ప్రధాని మొదలుకుని మంత్రులు, ఇతర స్థాయిల్లోని నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రాత్రి పగలు అనే తేడాలు లేకుండా మహమ్మారిని ఎదుర్కునే విధుల్లో నిమగ్నమయ్యారు. దేశ ఆరోగ్య మంత్రి వాంగ్మో కొన్ని వారాలపాటు ఇంటికి వెళ్లకుండా రాత్రిళ్లు మంత్రిత్వశాఖ కార్యాలయంలోనే ఉండిపోయారు. ప్రధానమంత్రి లోటే త్సెరింగ్‌ స్వయానా ప్రముఖ ఫిజీషియన్‌. లాక్‌డౌన్‌ కాలంలో తన ఆఫీసులోని కిటికీ వద్దనున్న కూర్చీలోనే ఆయన రాత్రిళ్లు నిద్రించారు. క్వారంటైన్‌ కేంద్రాల కోసం యజమానులు తమ హోటళ్లను ఉచితంగా అందించారు. రైతులు తమ పంటలను విరాళం ఇచ్చారు. వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేషనల్‌ కార్ప్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ యూనిఫామ్డ్‌ వాలంటీర్లు ‘డే సూంగ్‌’లో చేరి ప్రజలకు సేవలందించారు. అప్రమత్తత కలిగిన సమర్థ నాయకత్వం, ప్రజారోగ్య సూచనలు పాటించడానికి ప్రజల వద్ద తగినంత నిత్యావసరాలు, మందులు, డబ్బు ఉండేలా చూసుకోవడం, దేశ ఉమ్మడి హితం కోసం వ్యక్తిగతంగా, సాముహికంగా కొన్ని త్యాగాలు చేయకతప్పదనే అవగాహన ప్రజలు కలిగి ఉండటం (సామాజిక బాధ్యత)... ఇవన్నీ భూటాన్‌ కోవిడ్‌ను విజయవంతంగా అదుపు చేయడానికి దోహదం చేశాయి. 

చిన్నదేశమైనా ఈ దేశ ప్రజల నుంచి అగ్రరాజ్యం అమెరికా, సంపన్న పశ్చిమ దేశాలు, చివరకు మనం కూడా నేర్చుకోవాల్సింది కొంతైనా ఉందని చెప్పొచ్చు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top