ఎయిర్‌ ఇండియా డ్రీమ్‌లైనర్‌తో సంబంధాన్ని ఖండించిన టర్కీ | Air India Plane Crash False Says Turkey on Claims That its Firm Turkish | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా డ్రీమ్‌లైనర్‌తో సంబంధాన్ని ఖండించిన టర్కీ

Jun 15 2025 11:04 AM | Updated on Jun 15 2025 12:44 PM

Air India Plane Crash False Says Turkey on Claims That its Firm Turkish

అంకారా: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ నిర్వహణతో తమకు సంబంధం లేదని టర్కీ  స్పష్టం చేసింది. టర్కీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ కౌంటర్ డిస్ఇన్ఫర్మేషన్ దీనిపై స్పందిస్తూ, బోయింగ్ 787-8 ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణను టర్కిష్ టెక్నిక్ నిర్వహించిందనే వాదనను ఖండించింది.

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానాన్ని టర్కిష్ టెక్నిక్ నిర్వహించిందనే వాదన తుర్కియే-భారత్ సంబంధాలను దెబ్బతీసేలా ఉందని , ఇది ప్రజల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశించిన తప్పుడు సమాచారమని టర్కీ యంత్రాంగం ‘ఎక్స్‌’లో పేర్కొంది.  అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్ ఆవరణలోకి కూలిపోయింది.
 

‘2024-25 ఏడాదికి సంబంధించి ఎయిర్ ఇండియా, టర్కిష్ టెక్నిక్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బీ777-రకం వైడ్-బాడీ విమానాలకు ప్రత్యేకంగా టర్కీలో నిర్వహణ సేవలు అందిస్తారు. అయితే ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదు. నేటి వరకూ టర్కిష్ టెక్నిక్ ఈ రకమైన ఏ ఎయిర్ ఇండియా విమానానికి నిర్వహణ సేవలు అందించలేదు’ అని టర్కీ అధికారులు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని ఊహాగానాలను వ్యాపించకుండా ఉండేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు.

‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చిన దరిమిలా భారత్‌లోని తొమ్మిది  విమానాశ్రయాలలో సేవలను అందించిన ఒక టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోంది.  అలాగే మే 8న భారత్‌పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్‌లలో ఎక్కువ భాగం టర్కీలో తయారయినవి అని తేలింది.  ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో అప్రమత్తమైన టర్కీ.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ నిర్వహణలో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: Air India Plane Crashed: మనవరాళ్లతో ఆడుకునేందుకు లండన్‌ బయలుదేరి..

Advertisement
 
Advertisement
Advertisement