
సునామీ.. 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్ర తీర దేశాల్లో విధ్వంసం సృష్టించే దాకా ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా రష్యాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఫసిఫిక్ తీరంలోని 30 దేశాలు గజగజ వణికిపోతున్నాయి. రాకాసి అలలు తీర ప్రాంతాలను ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో చరిత్ర ఇప్పటిదాకా చవిచూసిన శక్తివంతమైన సునామీ ఏదో చూద్దాం..
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం. ఈ రీజియన్‌లో ఉన్న రష్యా కామ్చట్కా ద్వీపకల్పం వద్ద రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత భూకంపం సంభవించి.. పసిఫిక్ తీర దేశాల అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలాస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో అలలు 3-4 మీటర్ల(9-13 అడుగుల) ఎగసిపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటిదాక సంభవించిన శక్తివంతమైన భూకంపాల లిస్ట్‌లో.. ఇవాళ్టి రష్యా భూకంపానికి ఆరో స్థానం దక్కింది. అయితే..
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సునామీల జాబితాను ఓసారి పరిశీలిస్తే..
2004.. ఇండోనేషియా (సుమాత్రా)లో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం. ఈ భూకంపం ధాటికి సునామీ 13 దేశాల తీరాలను ముంచెత్తి 2,30,000 మందిని బలిగొంది.
2011.. 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్ (టోహోకు) తీరాన్ని ముంచెత్తించింది. ఈ ధాటికి ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించడంతో పాటు 18,500 మంది మృతి చెందారు.
1960.. చిలీ (వాల్డివియా) 9.5 తీవ్రతతో భూకంపం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. ఈ ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది.
1883.. ఇండోనేషియా (క్రాకటోవా) అగ్నిపర్వత విస్ఫోటనం ధాటికి బారీ అలలు ఎగసిపడ్డారు. మొత్తం 36,000 మంది మృతి చెందారు. ఈ పేలుడు శబ్దం.. 4,800 కిలోమీటర్ల దూరం దాకా వినిపించింది!!.

సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్‌తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి.
1896.. జపాన్ (సాన్‌రికు)లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 125 అడుగుల అలలు ఎగసిపడ్డాయి. ఈ సునామీ ధాటికి 22,000 మంది మృతి చెందారు. ఈ సునామీ ప్రభావంతో.. హవాయిలో 25 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడ్డాయి.
చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ(Mega Tsunami).. 1958 అలాస్కా (లిటుయా బే)లో జులై 9వ తేదీన సంభించింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 నుంచి 8.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి.. 914 మీటర్ల (3000 అడుగుల) నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. 90 మిలియన్ల టన్నుల రాళ్లు ఒక్కసారిగా గిల్‌బర్ట్ ఇంటెల్ ఉపనదిలోకి పడిపోయాయి. దీంతో ఓ పెద్ద కొండ ఎత్తు మేర నీరు అలలాగ ఎగసిపడింది. సుమారు 1,720 అడుగుల (524 మీటర్లు) అల.. లిటుయా బేను ముంచెత్తింది. ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువ!. ఇదే ప్రాంతంలోని లిథుయా గ్లేసియర్ (Lituya Glacier) వద్ద కొంత మంచు కూడా విరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల వివరాలు చెబుతున్నప్పటికీ.. ప్రధాన అలను ఏర్పరచినది రాళ్ల పతనం మాత్రమే. అయితే ఇక్కడ జనసాంద్రత.. అదీ ఆ సమయంలో తక్కువగా ఉండేది. అందుకే మెగా సునామీ ముంచెత్తినా కేవలం ఐదుగురే మరణించారు. వీళ్లంతా పడవలో ప్రయాణిస్తుండగా మృత్యువాత పడ్డారు. అయితే మరో ఇద్దరు అనూహ్యంగా ఈ విలయం నుంచి ప్రాణాలతో బయటపడడం గమనార్హం.
1868.. పెరూ(చిలీ) 8.5 తీవ్రత భూకంపంతో సునామీ ముంచెత్తి 25,000 మందిని బలిగొంది. ఇది కూడా హవాయిపై ప్రభావం చూపెట్టింది.
1755.. పోర్చుగల్ (లిస్బన్)లో 8.5–9.0 భూకంపం సంభవించింది. 3 నుంచి 6 నిమిషాలపాటు భూమి కంపించింది. 40 నిమిషాల తర్వాత.. భారీ అలలతో అట్లాంటిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ ముంచెత్తడంతో 50,000 మంది మృతి చెందారు. యూరోప్ అంతటా, అలాగే కరేబియన్ దీవులు, బ్రెజిల్‌ను ఈ సునామీ ప్రభావం తాకింది. ఈ భూకంప సునామీ చరిత్రలోనే తత్వవేత్తల రచనలతో.. అత్యంత విధ్వంసకరమైన ప్రకృతి విపత్తుగా నిలిచిపోయింది ఇది.
