అఫ్గాన్‌లో తిండి కోసం ఆడపిల్లలను అమ్ముకుంటున్న తల్లిదండ్రులు..

Afghans Selling Off Babies As child marriage Amid Starvation - Sakshi

అఫ్గానిస్తాన్‌: ఆకలి చావులు, ఆర్థిక సంక్షోభంతో పొత్తిళ్లలోనే పెళ్లిళ్లు! 

ఎదురుకట్నం తీసుకొని 20 రోజుల పసిపిల్లలకూ పెళ్లిళ్లు

తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అఫ్గాన్‌లో దుర్భర పరిస్థితులు

చేసేందుకు పని దొరక్క, తినేందుకు తిండి లేక జనాల పాట్లు 

పొత్తిళ్లలో పసిపాప... ఓ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ. అవును 20 రోజుల ఈ పసికందుకు పెళ్లి చేసేశారు. అఫ్గాన్‌లో ఇలాంటి పూర్ణమ్మలు ఇంటికొకరు. తాలిబన్ల వశమయ్యాక అఫ్గాన్‌ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. చేయడానికి పనిలేదు. తినడానికి తిండి లేదు. పసిపిల్లల కడుపు నింపలేని పరిస్థితి. ఆకలి పేగుబంధాన్ని సైతం జయించేసింది. చేసేదేం లేక చిన్నారులను, పసికందులను తల్లిదండ్రులు పెళ్లి పేరుతో విక్రయిస్తున్నారు. తమ దగ్గర ఉండి ఆకలితో చచ్చేకంటే... ఏదో ఒకచోట వాళ్లు బతికుంటే చాలంటున్నారు.  

ఈ బాలిక ఏడేళ్ల జోహ్రా. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే ఉంటోంది. కానీ తనను కొనుక్కున్న వ్యక్తి వచ్చి ఎప్పుడు పట్టుకెళ్తాడోనన్న భయంతో బతుకుతోంది. తండ్రి రోజూవారి కూలీ. అంతకుముందు తినడానికి తిండైనా ఉండేది. కానీ అఫ్గాన్‌ తాలిబన్ల చెరలోకి వెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. ఒక్క జోహ్రానే కాదు.. 
ఐదేళ్ల మరో కూతురినీ అమ్మేశాడు తండ్రి ఖాదిర్‌. 
చదవండఙ: 
మరో సంక్షోభం దిశగా అఫ్గన్‌! ఐరాస హెచ్చరిక

ఈమె పేరు నోరా. 8 ఏళ్లు. తండ్రి పేరు హలీమ్‌. మరో నెల రోజుల్లో నోరాను అమ్మేస్తానని హలీమ్‌ తన చుట్టుపక్కల వాళ్లతో చెప్పి ఉంచాడు. ఓ రూ. 80 వేలైనా వస్తాయని, కొన్ని రోజులకు తిండికి సరిపోతాయని చెబుతున్నాడు. ఆకలితో అల్లాడి చనిపోయేలా ఉన్నామని, ఇంకో దారి కనిపించట్లేదని బోరుమంటున్నాడు. 

అల్లాడుతున్న అఫ్గాన్‌..
అఫ్గనిస్తాన్‌లో ఇది ప్రతి పేదింటి కథ. ఆగస్టులో తాలిబాన్లు చేజిక్కించుకున్నాక అక్కడి పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో ఉన్న అఫ్గాన్‌ సర్కారు ఆస్తులు, డబ్బులను ఆ దేశాలు ఫ్రీజ్‌ చేశాయి. ఆ దేశానికి అందే సాయమూ ఆగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పనులు లేకుండా పోయాయి. చాలా మందికి ఉద్యోగాలూ పోయాయి. ఎంతో మందికి జీతాలు కూడా ఆగిపోయాయి. పేదరికం పెరిగిపోయింది. తిండి దొరకడమూ కష్టమైంది. దీనికితోడు ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పని కోసం, తిండి కోసం పేద ప్రజలు అల్లాడుతున్నారు.  
చదవండి: టైటానిక్‌ ఓడను చూడలనుకుంటున్నారా.. టికెట్‌ రూ.కోటి 87 లక్షలే

చిన్నారి పెళ్లికూతుళ్లు..
 పేదరికం పెరగడం, పనుల్లేకపోవడంతో ఆకలికి అల్లాడుతున్న తమ కుటుంబాలను చూడలేక చాలా మంది అఫ్గానీలు తమ చిన్నారి కూతుళ్లను అమ్ముతున్నారు. 20 రోజుల పిల్లల నుంచి 18 ఏళ్ల అమ్మాయిల వరకు ఎదురుకట్నం తీసుకొని పెళ్లి చేసుకునేందుకు ఇచ్చేస్తున్నారు. కొందరు ముందస్తుగానే చిన్నారులను ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. మరికొందరు అప్పు కింద పిల్లల్ని అప్పజెప్పేస్తున్నారు. అద్దె కట్టలేదని ఓ వ్యక్తి 9 ఏళ్ల కూతురును ఇంటి యజమాని తీసుకెళ్లాడని మానవ హక్కుల కార్యకర్తలు చెప్పారు. వాయవ్య అఫ్గాన్‌లో ఓ వ్యక్తి తన ఐదుగురు పిల్లలకు తిండి పెట్టలేక మసీదు దగ్గర వదిలేశాడని తెలిపారు.  

మున్ముందు 97% మంది 
పేదరికంలోకి.. తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోకముందు అఫ్గాన్‌లో అధికారికంగా పెళ్లి వయసు 16 ఏళ్లు. తాలిబన్లు రాకముందు కూడా దేశంలో బాల్య వివాహాలున్నాయి. కానీ గత కొన్ని నెలలుగా ఇవి పెరిగిపోయాయి. మున్ముందు ఇవి రెండింతలయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 20 రోజుల పిల్లలను కూడా మున్ముందు పెళ్లి చేసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిసిందని యునిసెఫ్‌ వెల్లడించింది. ప్రపంచంలో అతిదారుణమైన మానవ సంక్షోభాన్ని అఫ్గాన్‌ ఎదుర్కుంటోందని యునిసెఫ్‌ తెలిపింది. 2022 మధ్య కల్లా దేశంలోని 97 శాతం కుటుంబాలు పేదరికంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.  

మేమున్నామంటున్న యునిసెఫ్‌.. 
స్వేచ్ఛగా ఎదగాల్సిన బాల్యం పంజరంలో బందీ అయిపోతోంది. పెళ్లి చేసుకున్న ఆ చిన్నారి బాలికలను పని వాళ్లుగా, బానిసలుగా చూస్తారు. ఆ పిల్లల, మహిళల కన్నీటి బాధలు చూసిన యునిసెఫ్‌ సాయానికి ముందుకొచ్చింది. అక్కడి ప్రజల కోసం ఇప్పటికే నగదు సాయం కార్యక్రమం మొదలు పెట్టామని వెల్లడించింది. ఇతర దేశాలూ సాయం చేయాలని కోరుతోంది. చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయొద్దని మత పెద్దలకు చెబుతోంది.
-సాక్షి, సెంట్రల్ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top