Antony Blinken: అఫ్గన్‌తో దౌత్య సంబంధాలు.. అమెరికా కీలక ప్రకటన

Afghanistan: US Suspended Diplomatic Presence Transfer Operations to Doha - Sakshi

వాషింగ్టన్‌: అఫ్గనిస్తాన్‌ నుంచి తమ సేనల ఉపసంహరణతో దౌత్యపరంగా తాము అక్కడి నుంచి నిష్క్రమించినట్లైందని, ఇక నుంచి దౌత్య సంబంధాలను ఖతార్‌ నుంచి నిర్వహిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ‘‘మిలిటరీ ఆపరేషన్‌ ముగిసింది. ఇక డిప్లొమాటిక్‌ మిషన్‌ మొదలుకానుంది. అమెరికా- అఫ్గనిస్తాన్‌ సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక మానవతా దృక్పథంతో అఫ్గన్‌ ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటామని బ్లింకెన్‌ స్పష్టం చేశారు. అయితే, తాలిబన్‌ ప్రభుత్వం ద్వారా కాకుండా, ఐక్యరాజ్యసమితి, ఎన్జీవోల వంటి స్వతంత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ సహాయం అందుతుందని పేర్కొన్నారు. అదే విధంగా... అఫ్గన్‌ను వీడాలనుకున్న ప్రతి అమెరికన్‌, అఫ్గన్‌, ఇతర పౌరులను సురక్షితంగా తరలించామని తెలిపారు.

కాగా కొద్ది మంది అమెరికా పౌరులు అక్కడే చిక్కుకుపోయారన్న బ్లింకెన్‌.. త్వరలోనే వారిని మాతృదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాలపై తాలిబన్లు ఆంక్షలు విధించవద్దని, మహిళలు, మైనార్టీ హక్కులను కాలరాసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశారు. 

చదవండి: Joe Biden: అఫ్గనిస్తాన్‌ నుంచి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చిందో చెప్తా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top