Afghanistan Crisis: తాలిబన్లతో చర్చలు.. చైనా కీలక వ్యాఖ్యలు

Afghanistan Crisis: China Taliban Hold First Dialogue In Kabul - Sakshi

బీజింగ్‌/కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో చైనా ద్వైపాక్షిక చర్చలు జరిపింది. కాబూల్‌లో జరిగిన భేటీ ద్వారా తాలిబన్లతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెంబిన్‌ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘‘అఫ్గనిస్తాన్‌ ప్రజల స్వతంత్ర నిర్ణయాన్ని, మెరుగైన భవిష్యత్తు కోసం ఎంచుకున్న మార్గాన్ని చైనా గౌరవిస్తుంది.

అఫ్గనీయుల నాయకత్వంలో, అఫ్గన్ల చేత ముందుకు సాగాలనుకున్న వారికి మద్దతుగా నిలుస్తుంది. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, స్నేహపూర్వకంగా మెదులుతూ అన్ని రకాల సహాయం అందిస్తుంది. అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై, ఆ దేశ పునర్నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుంది. పొరుగు దేశమైన అఫ్గన్‌తో చర్చించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. చైనా, అఫ్గన్‌ తాలిబన్ల మధ్య ఫలవంతమైన చర్చలు, సంప్రదింపులు జరిగాయి’’ అని పేర్కొన్నారు. అయితే, ఏయే అంశాలపై చర్చించారన్న విషయాన్ని వెల్లడించలేదు.

కాగా తాలిబన్‌ పొలిటికల్‌ ఆఫీస్‌ డిప్యూటీ హెడ్‌ అబ్దుల్‌ సలాం హనాఫీ, అఫ్గనిస్తాన్‌లో చైనా రాయబారి వాంగ్‌ యూ మధ్య కాబూల్‌లో చర్చలు జరిగాయి. ఇక ఆగష్టు 15న తాలిబన్లు కాబూల్‌ను వశం చేసుకున్న తర్వాత అమెరికా, భారత్‌ సహా ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలు మూసివేయగా.. చైనా, పాకిస్తాన్‌, రష్యా మాత్రం ఎంబసీలను తెరిచే ఉంచాయి. కాగా తాలిబన్లతో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆగష్టు 16న ప్రకటించిన చైనా.. తాజాగా దానిని అమలు చేసింది. ఇక గత నెల 28న డ్రాగన్‌ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో తాలిబన్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ చైనాలో సమావేశమైన విషయం తెలిసిందే.

చదవండి: Anarkali Kaur Honaryar: ఒక్కో మెసేజ్‌ చూస్తుంటే గుండె పగిలిపోతోంది
‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top